విమానంలో వచ్చి ఏటీఎంలో చోరీ

27 Oct, 2020 10:06 IST|Sakshi

ఇద్దరు అరెస్ట్, రిమాండ్‌ 

35 గంటల్లో ఛేదించిన క్రైం పోలీసులు 

రూ.6.47 లక్షల విలువ గల వస్తువుల స్వాధీనం

సాక్షి, విశాఖపట్నం: నగరానికి విమానంలో వచ్చారు. హోటల్‌లో దిగి పక్కా ప్లాన్‌ రూపొందించుకున్నారు. ఒక స్కూటీ అద్దెకు తీసుకొని నాలుగు రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. ఓ ఏటీఎంని ఎంపిక చేసుకున్నారు. చోరీకి కావల్సిన సామగ్రిని కొనుగోలు చేశారు. గ్యాస్‌ సిలిండర్‌ అద్దెకు దొరక్కపోవడంతో దొంగిలించారు. ఆ తర్వాత సినీ ఫక్కీలో చోరీ చేసి ఎంచక్కా చెక్కేశారు. ఖరీదైన వస్తువులు కొన్నారు. జల్సా చేద్దామనేలోగా పోలీసుల చేతికి చిక్కారు. ఆదర్శనగర్‌ ప్రాంతం సుందర్‌నగర్‌లో ప్రధాన రహదారి పక్కన ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను విశాఖ క్రైం పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌ కమిషనరేట్‌లో క్రైం డీసీపీ సురేష్‌బాబు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.  

పంజాబ్‌ రాష్ట్రం ముత్సర్‌ కోట్లిరోడ్డు–4కు కెందిన సమర్‌ జ్యోత్‌సింగ్, కేరళ రాష్ట్రం కేసరగుడ్‌ జిల్లా చీరువుత్తురు నగరానికి చెందిన జాఫర్‌ సాధిక్‌ కలిసి ఈనెల 16న హైదరాబాద్‌ నుంచి విశాఖ నగరానికి విమానంలో చేరుకున్నారు. ఇక్కడ ఒక హోటల్‌లో దిగారు. మర్నాడు ఒక స్కూటీ నలంద బైక్‌ రెంటల్‌ షాపు వద్ద అద్దెకు తీసుకున్నారు. నగరంలోని విశాలాక్షినగర్, మిదిలాపూరికాలనీ(మధురవాడ), మురళీనగర్, ఆదర్శనగర్‌ దరి సుందర్‌నగర్‌లోని ఏటీఎంల వద్ద రెక్కి నిర్వహించారు. సుందర్‌నగర్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలో చోరీ చేయాలని ప్లాన్‌ చేసుకున్నారు. 20వ తేదీన గ్యాస్‌ సిలిండర్‌ కోసం అల్లిపురంలోని ఓ గ్యాస్‌ సిలిండర్‌ షాపులో సంప్రదించగా వారు నిరాకరించారు. దీంతో అదే రోజు రాత్రి ఆ షాప్‌లోనే గ్యాస్‌ సిలిండర్లు దొంగిలించారు.
 
గ్యాస్‌ సిలిండర్లతోపాటు గుణపం, గ్యాస్‌ కట్టర్తో పలు వస్తువులను సుందర్‌నగర్‌ ఏటీఎం ప్రాంతంలో పార్కు వద్ద ఉంచారు. 21వ తేదీ రాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు ఏటీఎం కేంద్రంలోకి వస్తువులను చేర్చారు. జాఫర్‌ సాధిక్‌ బయట ఉండి అటువైపు వచ్చిన వారిని పరిశీలించాడు. సమర్‌ జ్యోత్‌ సింగ్‌ ఏటీఎం లోపలకి వెళ్లి  సీసీ కెమెరా కనెక్షన్‌ కట్‌ చేశాడు. తరువాత గ్యాస్‌ కట్టర్‌తో నగదు బాక్స్‌ని కట్‌ చేసి రూ. 9,59,500 నగదును బ్యాగ్‌లో సర్దుకున్నాడు. అనంతరం వారు నగదుతో హోటల్‌కు చేరుకున్నారు. 22వ తేదీ ఉదయం 10.30 గంటల సమయంలో వారు అద్దెకు తీసుకున్న స్కూటర్‌ని నలంద షాపులో పెట్టి విశాఖ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లిపోయారు.   (ముసుగులు.. గ్యాస్‌కట్టర్లు.. మారణాయుధాలు!)

జల్సా ఇలా..
శామ్‌సంగ్‌ ఫోన్‌ రూ.59,999 
ఒప్పో ఫోన్‌ రూ. 30,000
బెల్ట్‌ రూ. 10,000
లోదుస్తులు ఒక్కొక్కటి రూ. 3,000
షూ రూ. 8,000

పోలీసులు ఛేదించారిలా..  
22వ తేదీ ఉదయం స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఆరిలోవ సీఐ ఇమాన్యుయేల్‌రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. క్రైం డీసీపీ సురేష్‌బాబు, క్రైం ఏసీపీ పెంటారావు, సీఐలు, ఎస్‌ఐలు అక్కడకు చేరుకున్నారు. క్లూస్‌ టీమ్‌ను రప్పించి, గ్యాస్‌ సిలిండర్‌పై ఉన్న వేలిముద్రలను గుర్తించారు. అల్లిపురంలోని గ్యాస్‌ షాపు యజమాని వద్ద సమాచారం తీసుకున్నారు. అక్కడ నుంచి సీసీ ఫుటేజ్‌ సేకరించి, నేరస్తులు ఎటువైపు వెళ్లారు అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. 23న బెంగళూరు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ సిన్హా ఆదేశాల మేరకు ఆరు బృందాలుగా ఏర్పడి బెంగళూరు వెళ్లారు. అక్కడి పోలీసుల సహకారంతో నిందితులు ఒక హోటల్‌ వద్ద ఉన్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు. నిందితులను 35 గంటల్లో పట్టుకున్న పోలీస్‌ సిబ్బందిని డీసీపీ సురేష్‌బాబు అభినందించారు. నగరంలో ఈ తరహాలో ఏటీఎం దొంగతనం జరగడం ఇదే మొదటిసారని తెలిపారు. ఈ సమావేశంలో క్రైం ఏసీపీ పెంటారావు,ï సీÜఐలు అవతారం, సూర్యనారాయణ, వెంకునాయుడు, సింహద్రినాయుడు, రాము, ఎస్‌ఐలు లూధర్‌బాబుతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. 

నగదు, విలువైన వస్తువుల సీజ్‌  
నగదుతో పాటు విలువైన వస్తువులను క్రైం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.1.32,500 నగదు, రూ.4,500 (కాలిన 5 వందల నోట్లు), శామ్‌సంగ్‌ ఫోన్‌ (రూ.59,999), ఒప్పో ఫోన్‌ (రూ.30 వేలు), బెల్ట్‌ (రూ.10 వేలు), లోదుస్తులు ఒక్కొక్కటి (రూ.3 వేలు), షూ (రూ.8 వేలు)తోపాటు విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సమర్‌ జ్యోత్‌సింగ్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి తన సోదరుడు అకౌంట్‌కు బదిలీ చేసిన రూ.3 లక్షల నగదు రసీదులు స్వాధీనం చేసుకున్నారు. 

గతంలో కేసులు 
► ఏటీఎం దొంగతనం కేసులో ప్రధాన నిందితుడు సమర్‌ జ్యోత్‌ సింగ్‌ 2019లో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో  యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎం దొంగతనం కేసులో నేరస్తుడు. బెంగళూరులోని పరపరా అగ్రహంలో కెనరా బ్యాంక్‌ ఏటీఎం దొంగతనం కేసులోను, 2020 బెంగళూరు బైటాస్‌పురం ఎస్‌బీఐ ఏటీఎంలో దొంగతనం కేసులో నేరస్తుడు. ఓ హత్య కేసులోను నిందిడుతుగా ఉన్నాడు.  
► జాఫర్‌ సాధిక్‌ గతంలో బెంగళూరు జలహలీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కెనరా బ్యాంక్‌ ఏటీఎంలో దొంగతనం చేశాడు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి చందానగర్‌లో ఎస్‌బీఐ ఏటీఎం దొంగతనం కేసులో నేరస్తుడు. 

మరిన్ని వార్తలు