జుత్తాడ దారుణం: గుండెలు పగిలేలా రోదన

17 Apr, 2021 08:36 IST|Sakshi

ఎంవీపీకాలనీ (విశాఖతూర్పు)/డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): వి.జుత్తాడ మారణకాండ విషాద ఛాయలు శుక్రవారం శివాజీపాలేన్ని కమ్మేశాయి. అంత్యక్రియల పర్వాన్ని ప్రత్యక్షంగా చూసిన శివాజీపాలెమంతా కంటతడిపెట్టుకుంది. బాధితుడు బమ్మిడి విజయ కిరణ్‌ తాతయ్య చెల్లుబోయిన అప్పారావుది శివాజీపాలెం కావడంతో హత్యకు గురైన ఆరు మృతదేహాలకు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు మృతదేహాలను కేజీహెచ్‌ నుంచి శివాజీపాలెం తీసుకొచ్చారు. అప్పటికే పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లుసిద్ధం చేశారు. శుక్రవారం రాత్రి మహాప్రస్థానం వాహనాల్లో అప్పారావు ఇంటికి మృతదేహాలు చేరుకోగా కనీసం వాటిని కిందకు దించలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి అటే శ్మశానవాటికకు తరలించారు. 

అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్‌
పెందుర్తి: వి.జుత్తాడలో ఆరుగురిని హత్య చేసిన నిందితుడు బత్తిన అప్పలరాజు(48)కు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు పెందుర్తి సీఐ కె.అశోక్‌కుమార్‌ తెలిపారు. అప్పలరాజును శుక్రవారం సాయంత్రం మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా పూర్తి స్థాయి విచారణ చేసి రిమాండ్‌కు తరలించాలని ఆదేశించారన్నారు. కేజీహెచ్‌లో వైద్య పరీక్షల సమయంలో హత్యలు ఎందుకు చేశావని నిందితుడ్ని మీడియా ప్రశ్నించగా.. తన కన్న కూతుర్ని లైంగికంగా వేధించడంతో ఈ హత్యలు చేశానని బదులిచ్చాడు.   

చదవండి: ఆరుగురి దారుణ హత్య వెనుక కారణాలివేనా?!

మరిన్ని వార్తలు