ముచ్చెమటలు పట్టించే గజ దొంగ.. వయసు 26.. వందకు పైగా కేసులు

26 Mar, 2022 14:00 IST|Sakshi

సాక్షి, ఆరిలోవ (విశాఖ తూర్పు): తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌..పోలీసులకు ముచ్చెమటలు పట్టించే గజ దొంగ..వయసు కేవలం 26..వందకు పైగా కేసులు...రెండు రాష్ట్రాలకు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌. ఎట్టకేలకు 2020లో విశాఖ పోలీసులకు చిక్కాడు. కోర్టు శిక్ష విధించింది. 2022 జూన్‌ 8 నుంచి విశాఖ సెంట్రల్‌ జైల్‌లో శిక్ష అనుభవిస్తున్నాడు. కట్‌ చేస్తే మళ్లీ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారాడు. అనకాపల్లి కోర్టుకు వాయిదా కోసం వెళ్లి తిరిగి సెంట్రల్‌ జైలుకు తీసుకొచ్చిన ఎస్కార్ట్‌ పోలీసులు కన్ను కప్పి పరారయ్యాడు. ఇది చిత్తూరు ఖైదీ కథ.. 

చిత్తూరు జిల్లా వడ్డిపల్లి గ్రామానికి చెందిన బత్తుల ప్రభాకర్‌ రెండు రాష్ట్రాల్లో 100కి పైగా చోరీ కేసుల్లో నిందితుడు. చిత్తూరు జిల్లాతో పాటు విశాఖ, పశ్చమ గోదావరి జిల్లాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. తాళాలు వేసిన ఇళ్లను దోచుకోవడం ప్రభాకర్‌కు వెన్నతోపెట్టిన విద్య. అందుకే ఇళ్లల్లోకి వెళ్లి బంగారం, నగదు, విలువైన వస్తువులు పట్టుకుపోయినా ఎవ్వరి కంటా పడేవాడుకాదు. ఇలా కొన్నేళ్లపాటు తనకు ఎదురులేకుండా పోయింది. రెండు రాష్ట్రాల పోలీసులకు కొరకురాని కొయ్యగా తయారయ్యాడు. 

2020 నుంచి శిక్ష అనుభవిస్తూ... 
ప్రభాకర్‌ 2020లో విశాఖ పోలీసులు ఎట్టకేలకు ప్రభాకర్‌ను అరెస్టు చేశారు. 2020 సెప్టెంబరు 8 నుంచి విశాఖ జైల్‌లో శిక్ష అనుభవిస్తున్నాడు. శిక్ష అనుభవిస్తూనే రిమాండ్‌ ముద్దాయిగా కోర్టు వాయిదాలకు ఎస్కార్ట్‌ పోలీసులు హాజరుపరుస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 23న ప్రభాకర్‌ను అనకాపల్లి కోర్టుకు తీసుకువెళ్లి తిరిగి రాత్రి 8 గంటలకు విశాఖ సెంట్రల్‌ జైలుకు తీసుకొచ్చారు. ఎస్కార్ట్‌ వాహనం దిగి పరారయ్యాడు. చీకటి కావడంతో పోలీసులు ఆయన వెంట పరిగెత్తినా దొరకలేదు. దీంతో మరో కేసు ప్రభాకర్‌పై నమోదైంది. 
చదవండి: ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం ఎఫెక్ట్‌..పెరిగిన టిఫిన్‌ ధరలు

మరిన్ని వార్తలు