హీరో తండ్రిపై ప్రముఖ కమెడియన్‌ ఫిర్యాదు

9 Oct, 2020 14:25 IST|Sakshi

షాకింగ్‌గా ఉంది: విష్ణు విశాల్‌

అతడే మాకు అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వాలి

చెన్నై: తమిళ హీరో విష్ణు విశాల్‌ తండ్రి రమేశ్‌ కడవ్లా మీద ప్రముఖ హాస్య నటుడు సూరి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ప్లాట్‌ అమ్మకానికి ఉందంటూ తన దగ్గర 2.70 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని పేర్కొన్నాడు. తన డబ్బు తిరిగి చెల్లించాల్సిందిగా ఎన్నోసార్లు అడిగానని, అయినా ఐదేళ్లుగా వారి నుంచి సమాధానం రాలేదని తెలిపాడు. రమేశ్‌తో పాటు ఫినాన్షియర్‌ అంబువేల్‌ రాజన్‌కు కూడా ఇందులో ప్రమేయం ఉందని, అంతేగాకుండా వీర ధీర సూరన్‌ సినిమాకు గానూ తనకు ఇవ్వాల్సిన రూ. 40 లక్షల పారితోషికాన్ని ఎగ్గొట్టారని ఆరోపించాడు. సూరి ఫిర్యాదు మేరకు అడయార్‌ పోలీసులు రమేశ్‌తో పాటు అంబువేల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా రమేశ్‌ గతంలో పోలీస్‌ అధికారిగా విధులు నిర్వర్తించి రిటైర్‌ అయ్యారు. (చదవండి: అబ్బే... ఆ ఉద్దేశం లేదు)

షాకింగ్‌గా ఉంది: విష్ణు విశాల్‌
ఇక ఈ విషయంపై స్పందించిన విష్ణు విశాల్‌.. తమ కుటుంబంపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశాడు. ‘‘ఇది చాలా షాకింగ్‌గానూ, బాధ కలిగించేది గానూ ఉంది. నాపై, మా నాన్నపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి వెనుక ఏదో దురుద్దేశం ఉంది. నిజానికి సూరి, విష్ణు విశాల్‌ స్టూడియో నుంచి 2017లో కవరిమాన్‌ పరాంబరై సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్‌ తిరిగి చెల్లించాల్సి ఉంది. ఆ సినిమా నుంచి అతడు తప్పుకొన్నాడు’’ అని పేర్కొన్నాడు. ఇతరులపై నిందలు వేయడం సులభమే కానీ, అంతకంటే ముందు తమ గురించి తాము పరిశీలన చేసుకోవాలన్న కోట్‌ను ఉటంకిస్తూ ట్విటర్‌ వేదికగా కౌంటర్‌ ఇచ్చాడు. 

మరిన్ని వార్తలు