అత్యంత విషమంగానే ప్రియాంక పరిస్థితి

2 Dec, 2020 16:14 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న కేజీహెచ్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ సాధన

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా కేజీహెచ్‌ ఆర్‌ఎంవో డాక్టర్‌ సాధన మాట్లాడుతూ ‘ఈఎన్‌టీ నిపుణుల పర్యవేక్షణలో ప్రియాంకకు మెరుగైన వైద్యం అందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇక తనకు తానుగా గాయం చేసుకున్న శ్రీకాంత్‌ కోలుకుంటున్నాడు’ అని తెలిపారు.

కక్షగట్టి పథకం ప్రకారం..
నగరంలోని థామ్సన్‌ వీధిలో ప్రియాంక, శ్రీకాంత్ పక్క పక్క ఇంట్లో ఉంటున్నారు. డిగ్రీ చదువుతున్న ప్రియాంక, శ్రీకాంత్‌తో ఏడాదికాలంగా స్నేహంగా ఉంటోంది. ఈ దశలో శ్రీకాంత్ ప్రవర్తనపై అనుమానం వచ్చి అతడికి దూరంగా ఉండాలని ప్రియాంకకు ఇటీవల  ఆమె తల్లిదండ్రులు చెప్పారు. దాంతో ఆమె శ్రీకాంత్‌తో దూరంగా ఉంటూ వస్తోంది. ఈ దశలో శ్రీకాంత్ ఆమెపై కక్షగట్టి పథకం ప్రకారం ఇవాళ (బుధవారం) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియాంకపై దాడికి పాల్పడ్డాడు. మంచం కింద దాక్కొని ఆమెపై కత్తితో దాడి చేసి గొంతుకోశాడు. అనంతరం అతను కూడా చాకుతో కొన్ని గాట్లు పెట్టుకున్నాడు. ( చద్ది బిర్యానీ పెట్టిందని వదినను..)

ఒక్కసారిగా జరిగిన పరిణామంతో ప్రియాంక కేకలు వేస్తూ మెట్లు దిగుతుండగా కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో శ్రీకాంత్‌ను కూడా కేజీహెచ్‌కు తరలించారు. ప్రేమను నిరాకరించడంతో శ్రీకాంత్ ఓ పథకం ప్రకారం ప్రియాంకను కడతేర్చేందుకు ఈ దాడికి పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కేసు నుంచి తప్పించుకోవడానికి అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కూడా పేర్కొంటున్నారు

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ ప్రేమ్ కాజల్
దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక కేసులో సాక్ష్యాలను పోలీసులు సేకరిస్తున్నారు. అందులో భాగంగా ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్తో పాటు దిశ పోలీసులు కూడా పరిశీలించారు. దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్  ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ విషయంలో శ్రీకాంత్ కక్షతో దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రేమను నిరాకరించిందని కోపంతోనే ప్రియాంకపై శ్రీకాంత్‌ హత్యాయత్నం చేసినట్లు ఏసీపీ ప్రేమ్ కాజల్ తెలిపారు

మరిన్ని వార్తలు