బురిడీ మాష్టారు.. బండారం బట్టబయలు

29 Mar, 2021 11:18 IST|Sakshi
నిందితులు రమణబాబు, విజయదుర్గాదేవి

సాక్షి విశాఖపట్నం: మాయమాటలు చెప్పి మోసగించిన ఓ ఉపాధ్యాయుడు, అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి భూమి విక్రయించిన వారిద్దర్నీ  ఆదివారం అరెస్టు చేసి, నర్సీపట్నం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచారు. న్యాయమూర్తి 15 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. ఎస్‌ఐ ధనంజయ్‌ నాయుడు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మాకవరపాలెంకు చెందిన ఉపాధ్యాయుడు లాలం రమణబాబు, భార్య విజయ్‌దుర్గాదేవి నర్సీపట్నంలో ఆరు సెంట్లతో పాటు, విజయవాడ సమీపంలోని తాడేపల్లి వద్ద మరో రెండు సెంట్ల భూమి విక్రయించేందుకు 2019లో జోగుంపేటకు చెందిన గుడివాడ రాంబాబు నుంచి రూ.19 లక్షలు తీసుకున్నారు.

నకిలీ ధ్రువపత్రాలతో పురోణి రాసి రాంబాబుకు అందజేశారు. ఆ తరువాత రిజిస్ట్రేషన్‌ చేయాలని పలు సార్లు రాంబాబు కోరగా వారు స్పందించలేదు. దీంతో అనుమానించిన రాంబాబు ఆ రెండు ప్రాంతాల్లోని భూమికి సంబంధించిన ఈసీ పొందగా అవి వేరే వ్యక్తుల పేరుపై ఉన్నాయి. దీనిపై బాధితుడు రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితులను  నర్సీపట్నం న్యాయమూర్తి వద్ద హాజరు పరచగా 15 రోజులపాటు రిమాండ్‌ విధించారని ఎస్‌ఐ చెప్పారు.  

ఉద్యోగాల పేరుతో టోకరా 
లాలం రమణబాబు, భార్య విజయ్‌దుర్గాదేవి  పోస్టల్‌తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పలువురి నుంచి రూ.లక్షలు వసూలు చేసి స్వాహా చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. మాకవరపాలెం, నాతవరం, నర్సీపట్నం ప్రాంతాల్లో పలువురు వీరి చేతిలో మోసపోయారని చెప్పారు. బాధితులు సంబంధిత పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. 

నర్సీపట్నంలో మరో కేసు 
నర్సీపట్నం: ఉపాధ్యాయుడు రమణబాబు నర్సీపట్నంలో కూడా మరో మోసానికి పాల్పడ్డాడు. భూమి విక్రయం పేరుతో తోటి ఉపాధ్యాయురాలు కోనాల సంధ్య వద్ద రూ.30 లక్షలు రమణబాబు దంపతులు  తీసుకున్నారు. స్థలం రిజిస్ట్రేషన్‌ చేయకపోగా డబ్బులు అడిగినందుకు  సంధ్యపై దాడికి దిగాడు.  సంధ్య పట్టణ పోలీసు స్టేషన్‌లో జనవరి 23న ఫిర్యాదు చేయడంతో పట్టణ ఎస్‌ఐ లక్ష్మణ్‌రావు కేసు నమోదు చేశారు. అప్పట్లోనే రమణబాబు దంపతులను పట్టణ పోలీసులు అరెస్టు చేయాల్సి ఉండగా  అతను కోర్టు ఆర్డర్‌ తెచ్చుకోవడంతో కేసు విచారణ దశలో ఉండిపోయింది. ఉపాధ్యాయురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమణబాబు దంపతులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం గొలుగొండ కేసులో రమణబాబు దంపతులు అరెస్టు అయినప్పటికీ రిమాండ్‌ అనంతరం మళ్లీ అరెస్టు చేయనున్నట్టు  ఎస్‌ఐ లక్ష్మణ్‌రావు తెలిపారు.  

చదవండి: 67 ఏళ్ళ వయసులో ‘గేట్’‌ సాధించాడు!

మరిన్ని వార్తలు