3 నెలల కిందటే ప్రేమ పెళ్లి.. పెట్రోల్‌ పోసుకొని వివాహిత ఆత్మహత్య

20 Oct, 2022 17:17 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఎంవీపీ కాలనీ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. శ్రావణి అనే మహిళ పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. మంటలార్పేందుకు ప్రయత్నించిన ఎస్సైకు గాయాలయ్యాయి. 

వివరాలు.. గుంటూరుకు చెందిన శ్రావణికి, విశాఖకు చెందిన వినయ్‌తో మూడు నెలల కిందటే ప్రేమ వివాహం జరిగింది. వినయ్‌కు మద్యం అలవాటు కారణంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త మద్యానికి బానిసై తనను వేధిస్తున్నాడని పోలీసులకు శ్రావణి ఫిర్యాదు చేసింది. భార్యభర్తలకు కౌన్సిలింగ్‌ ఇచ్చేందుకు పోలీసులు గురువారం పోలీస్‌ స్టేషనకు పిలిపించారు. దంపతులకు ఎస్సై శ్రీనివాస్‌ కౌన్సిలింగ్‌ ఇస్తుండగానే ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది.

మనస్తాపంతో  స్టేషన్‌ బయటికి వచ్చిన శ్రావణి.. ఒంటిపై పెట్రోల్‌ పొసుకొని నిప్పంటించుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలు ఆర్పేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఎస్సై శ్రీనివాస్‌ చేతికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన శ్రావణిని పోలీసులు సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. పోలీసులు గుంటూరులోని శ్రావణి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. భర్తను అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు