మావోయిస్టుల కాల్పులు: పెళ్లి ముచ్చట తీరకుండానే

5 Apr, 2021 11:22 IST|Sakshi
మావోల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన జవాన్‌ జగదీష్‌

కోబ్రా దళంలో విధులు 

వచ్చేనెలలో వివాహానికి ఏర్పాట్లు 

జవాన్‌ మృతితో శోకసంద్రమైన కంచేడువలస, గాజులరేగ  

నేడు బ్లాక్‌డేగా ప్రకటన

డిగ్రీ వరకు చదివాడు. దేశ సేవలో తరించాలని తలచాడు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా ఎంపికయ్యాడు. మంచి శరీరసౌష్టవం, చురుకుగా కదిలే నైజంతో కోబ్రాదళం లీడర్‌గా ఎంపికయ్యాడు. వివాహ వయస్సు రావడంతో వచ్చేనెలలో జీవితభాగస్వామితో ఏడుఅడుగులు నడిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో విధి కన్నెర్రచేసింది. పెళ్లి ముచ్చట తీరకుండానే మావోయిస్టుల రూపంలో మృత్యువు కాటేసింది. కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని మిగిల్చింది. జవాన్‌ మృతితో విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగ, మక్కువ మండలం కంచేడువలసలో విషాదం అలముకుంది.

మక్కువ/విజయనగరం‌: చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య శనివారం జరిగిన కాల్పుల్లో జిల్లా యువకుడు, సీఆర్పీఎఫ్‌ జవాన్‌ రౌతు జగదీష్‌ (27) వీరమరణం పొందాడు. జిల్లా పోలీస్‌ యంత్రాగం తెలిపిన వివరాల ప్రకారం...జగదీష్‌ స్వగ్రామం మక్కువ మండలం కంచేడువలస. ప్రస్తుతం ఆయన కుటుంబం విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగలో నివసిస్తోంది. డిగ్రీ చదువుకున్న జగదీష్‌ 2010లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌గా ఎంపికయ్యాడు.

విధుల్లో చురుగ్గా మెలగడంతో కోబ్రాదళానికి లీడర్‌గా ఎంపికయ్యాడు. బీజాపూర్‌లో సీఆర్‌పీఎఫ్, కోబ్రా, డీఆర్‌జీ భద్రతా దళాలతో కలిసి కూంబింగ్‌ చేస్తున్న సమయంలో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మృతిచెందారు. కొద్దికాలంలోనే మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. మృతుడి తండ్రి సంహాచలం కూలీకాగా, తల్లి రమణమ్మ గృహిణి. అక్క సరస్వతికి వివాహం అయ్యింది. జగదీష్‌ కూడా వచ్చేనెల 22న వివాహం చేసుకునేందుకు ముహూర్తం ఖరారైంది.

మరో వారం రోజుల్లో సెలవుపై రావాల్సి ఉంది. కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో ఉన్నారు. ఇంతలో కొడుకు మృతిచెందాడన్న వార్తతో దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఆదుకుంటాడనుకున్న సమయంలో ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులిద్దరూ కన్నీరుమున్నీరవుతున్నారు. జగదీష్‌ మృతితో గాజులరేగ, కంచేడువలస వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. గాజులరేగలో బ్లాక్‌ డే పాటిస్తామని యువకులు తెలిపారు.

మరో తెలుగు జవాన్‌
జగదీష్‌తో పాటు మరో తెలుగు జవాన్‌ మావోయిస్టుల చేతిలో మృతి చెందాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ కూడా మరణించారు. విజయకుమారి, రవీంద్రబాబు దంపతుల రెండో సంతానం అయిన మురళీకృష్ణ  ఆరేళ్ల క్రితం సైనిక దళంలో చేరారు. ప్రస్తుతం కోబ్రా  టూ10 విభాగంలో విధులు నిర్వర్తిస్తూ మావోయిస్టుల తుపాకీ గుళ్లకు బలయ్యాడు. త్వరలో మురళీ వివాహం చేయాలని తల్లిదండ్రులు భావిస్తుండగా  జరిగిన ఈ ఘటన ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ రోజు మధ్యాహ్నం జవాన్‌ మురళీ భౌతికకాయం గాజులరేగ గ్రామానికి చేరుకోనుంది. 


చదవండి: పవన్‌కల్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు

మరిన్ని వార్తలు