ఎల్‌పీసీ ఇవ్వలేదని వీఆర్వో..

5 Aug, 2020 08:12 IST|Sakshi

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): ఎల్‌పీసీ(లాస్ట్‌ పే సర్టిఫికెట్‌) ఇవ్వలేదనే మనస్తాపంతో వీఆర్‌ఓ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన  చిలప్‌చెడ్‌ మండలం చండూర్‌ గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం చండూర్‌ గ్రామానికి చెందిన గొట్టం వెంకటేశం(48) వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. గత సంవత్సరం చిలప్‌చెడ్‌ మండలం నుంచి నర్సాపూర్‌ బదిలిపై వెళ్లి, ఆ తర్వాత నర్సాపూర్‌ మండలం బ్రహ్మణపల్లి, తుజాల్‌పూర్‌ గ్రామాలకు వీఆర్వోగా విధులు నిర్వహించాడు. ఆ సమయంలో అతని పనితీరు నచ్చడం లేదని, అధికారులు కలెక్టర్‌ కార్యాలయానికి సరెండర్‌ చేశారు. అక్కడ 4 నెలలు విధులు నిర్వహించిన అనంతరం నెల క్రితం చేగుంట మండలానికి బదిలీ పై వెళ్లాడు. కాగా ఇన్ని చోట్లకు వెళ్లినా నర్సాపూర్‌ నుంచి వెళ్లిన అతనికి నర్సాపూర్‌ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌లు లాస్ట్‌ పే సరి్టఫికేట్‌(ఎల్‌పీసీ) ఇవ్వకపోవడంతో 8 నెలలుగా అతడికి జీతం రాలేదు.

జీతం రాకపోవడంతో తరుచూ భార్యతో బాధపడుతూ ఉండేవాడని,  వెంకటేశం ఎల్‌పీసీ కోసం నర్సాపూర్‌ కార్యాలయం చుట్టూ తిరగగా ఒకసారి వెంకటేశం కుమారుడు రంజిత్‌ కుమార్‌ను పంపిస్తే ఎల్‌పీసీ ఇస్తామన్నారని, రంజిత్‌ వెళ్లినా ఎల్‌పీసీ ఇవ్వలేదన్నారు.  సోమవారం రాఖీ పౌర్ణమి కావడంతో అతని భార్య సువర్ణ రాఖీలు కట్టేందుకు కుమారుడు రంజిత్‌తో కలసి అమ్మగారి గ్రామం కుసంగి వెళ్లి, మంగళవారం 11:30 గంటలకు చండూర్‌ గ్రామానికి రాగా వెంకటేశం ఉరి వేసుకుని ఉన్నాడన్నారు. సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్‌ఐ మల్లారెడ్డి తెలిపారు.  

మరిన్ని వార్తలు