Kalyana Laxmi : డబ్బుల కోసం వీఆర్వో కక్కుర్తి

29 Jun, 2021 13:46 IST|Sakshi

సాక్షి, నల్లబెల్లి(వరంగల్‌): నిరుపేద కుటుంబాల్లో యువతుల వివాహానికి ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకం దరఖాస్తు ఆమోదించేందుకు లంచం డిమాండ్‌ చేసిన వీఆర్వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు యువతి తండ్రి నుంచి రూ.3వేలు తీసుకుంటున్న వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లి మండలంలోని మేడపల్లి వీఆర్వో ఐలయ్య సోమవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. వివరాలు.. 

విచారణ నివేదిక కోసం..
మేడపల్లి గ్రామానికి చెందిన దేవరాజు పద్మ – ఏకాంబ్రం దంపతుల కుమార్తె మౌనిక వివాహాన్ని ఈ ఏడాది జనవరి 6న జరిపించారు. ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి పథకం కోసం ఏకాంబ్రం మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసి పత్రాలను ఫిబ్రవరి 13న వీఆర్వో ఐలయ్యకు అందించాడు. అయితే, విచారణ నివేదికను పూర్తి చేసేందుకు వీఆర్వో ఐలయ్య రూ.10 వేలు లంచం డిమాండ్‌ చేయగా అంత మొత్తం ఇవ్వలేనని చెప్పడంతో రూ.5వేలైనా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశాడు. ఈమేరకు మొత్తాన్ని చెక్కు వచ్చాక ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొన్నాడు. గత నెల 25న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారురాలి తల్లి పద్మ చెక్కు తీసుకున్నప్పటి నుంచి వీఆర్వో ఐలయ్య రూ.5వేల కోసం వేధిస్తుండగా, ఏకాంబ్రం తమ వద్ద డబ్బు లేదని చెప్పాడు.

రూ.3వేలైనా ఇవ్వాలని తేల్చిచెప్పడంతో ఏకాంబ్రం శుక్రవారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ మధుసూదన్, సీఐలు క్రాంతికుమార్, శ్యాంసుందర్‌ రంగంలోకి దిగి ఏకాంబ్రం నివాసం ఉంటున్న నర్సంపేట మండలం రాజుపేటలో సోమవారం మాటు వేశారు. అక్కడకు వచ్చిన వీఆర్వో ఐలయ్య రూ.3 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అనంతరం ఆయనను నల్లబెల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లి రికార్డులు పరిశీలించారు. అనంతరం డీఏస్పీ మధుసూదన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే 94404 46146 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. దీంతో చైల్డ్‌లైన్‌ ప్రతినిధులు బాలిక, బాలుడితో పాటు వారి తల్లిదండ్రులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  

చదవండి: ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్

మరిన్ని వార్తలు