పెళ్లింట ఆడిపాడి.. మరునాడు కారు డిక్కీలో!

8 Dec, 2020 08:17 IST|Sakshi
కారు డిక్కీలో మోహిద్‌ మృతదేహం

సాక్షి, అమరచింత(వనపర్తి జిల్లా): పెళ్లి వేడుకల్లో హుషారుగా ఆడిపాడి, చిందులేసిన ఓ బాలుడు కొన్ని గంటల్లోనే కారు డిక్కీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వనపర్తి జిల్లా అమరచింత పట్టణానికి చెందిన కతాల్‌ తన కూతురి వివాహాన్ని ఆదివారం జరిపించారు. ఇదే గ్రామానికి చెందిన మోహిద్‌(16) సమీప బంధువు కావడంతో ఈ వేడుకలో పాల్గొన్నాడు. తీరా ఆ ఇంటి ఎదుట ఆగి ఉన్న ఓ కారులో సోమవారం సాయంత్రం శవమై కనిపించాడు. దీంతో ఆ గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.  

నా అనే వారు లేక.. 
అమరచింత పట్టణానికి చెందిన భాను, అఫ్సర్‌ దంపతులకు మోహిద్‌ ఒక్కగానొక్క కుమారుడు. గతంలోనే భార్యను వదిలిపెట్టి అఫ్సర్‌ ఎటో వెళ్లిపోగా రెండేళ్ల క్రితం ఆమె కేన్సర్‌తో మృతి చెందింది. దీంతో నా అనేవారు లేక ఒంటరిగా ఉన్న మోహిద్‌ చిన్న, చిన్న కూలి పనులను చేసుకుంటూ రోజువారీ జీవనాన్ని సాగించేవాడు. ఈ క్రమంలోనే తమకు దగ్గరి బంధువు అయిన కతాల్‌ ఇంట్లో జరుగుతున్న పెండ్లి వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ బాలుడు ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నిద్రించడానికి వెళ్లిపోయాడు. హైదరాబాద్‌కు చెందిన కతాల్‌ బావమరిది ఇసాక్‌ తీసుకొచ్చిన కారు డిక్కీలో సోమవారం సాయంత్రం విగతజీవిగా పడి ఉండటం చూసి అందరూ కన్నీరు మున్నీరయ్యారు. డిక్కీలో ఊపిరి ఆడక చనిపోయాడా? లేక ఎవరైనా అందులో పడవేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు