కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. దైవ దర్శనానికి వెళ్తుండగా..

3 Sep, 2022 11:52 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌/ వరంగల్‌: కరీంనగర్‌ జిల్లా మానకొండూరు శివారు ప్రాంతంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హనుమకొండ నుంచి వేములవాడకు వెళ్తున్న ఏపీ 36ఏటీ 0648 గల మారుతి ఆల్టో కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కూతురికి వీసా రావడంతో
కారులో మృతి చెందిన ఇద్దరిని వరంగల్‌ జిల్లా కాశీబుగ్గకు చెందిన భార్యాభర్తలు మాధవి, సురేందర్‌గా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన దంపతుల్లో సురేందర్ ప్రమాద స్థలలోనే చనిపోగా మాధవి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న తమ కూతురు మేఘన, మేనల్లుడు అశోక్ గాయపడ్డారు. వీరి పరిస్థితి ప్రస్తుతం విషయంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

కాశీబుగ్గలో విషాదం
అయితే కూతురు మేఘనకు అమెరికా వీసా రావడంతో కుటుంబమంతా వేములవాడ రాజన్న దేవాలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దైవదర్శనం కోసం శనివారం ఉదయం కారులో వేములవాడకు బయలుదేరగా.. మార్గమధ్యలో మానకొండూర్‌ మండలం ముంజంపల్లి వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటన సమాచారం తెలియడంతో కాశీబుగ్గలో విషాదం అలుముకుంది. మృతుల కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
చదవండి: పెళ్లికి పెద్దలు నిరాకరించారని.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం  

మరిన్ని వార్తలు