సంచలనం సృష్టించిన కేసు.. 14 రోజులుగా గాలింపు.. డానియెల్‌ దొరికాడు..!

25 Oct, 2021 10:12 IST|Sakshi

అమ్మబోతూ పోలీసులకు పట్టుబడిన ముఠా

సీపీ తరుణ్‌ జోషి స్వీయ పర్యవేక్షణలో..

కేసును ఛేదించిన కమిషనరేట్‌ పోలీసులు

సాక్షి, వరంగల్‌: సంచలనం సృష్టించిన రెండేళ్ల బాలుడు డానియెల్‌ కేసును వరంగల్‌ కమిషరేట్‌ పోలీసులు ఛేదించారు. పక్కా ప్లాన్‌ ప్రకారం బాబు ను కిడ్నాప్‌ చేసి అమ్మాలని నిర్ణయించుకున్న లోకల్‌ గ్యాంగ్‌ ఆట కట్టించిన పోలీసులు దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.  అయితే ఈ ముఠా వెనుక ఎవరెవరు ఉన్నారు.. పిల్లల అక్రమ రవాణా ఉద్దేశం ఏమైనా ఉందా అనే దిశగా లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఒక్క డానియెలేనా.. లేక గతంలో ఈ తరహాలో ఎంత మందిని కిడ్నాప్‌ చేశారనే కోణంలో కూడా వివరాలు సేకరిస్తున్నట్లు తెలి సింది. రెండేళ్ల బాబు సురక్షితంగా దొరకడంతో ఇటు పోలీసు ఉన్నతాధికారులతోపాటు అటు తల్లిదండ్రులు అమితానందం వ్యక్తం చేస్తున్నారు.  ( చదవండి: పోలీసుల మోహరింపు, తనిఖీలు.. హిడ్మా కోసమేనా..? )

14 రోజులుగా గాలింపు..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రాజమండ్రిలోని కోరుకుంటకు చెందిన దత్తా ఐశ్వర్య, ఆర్యలకు రెండేళ్ల బాబు డానిఝెల్‌ ఉన్నాడు. వీరు వరంగల్‌ మట్టెవాడ ఠాణాకు కూతవేటు దూరంలో ఉన్న జెమినీ టాకీస్‌ సమీపంలోనే దోమ తెరలు, దువ్వెన్లు, అద్దాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఎప్పటి నుంచో ఐశ్వర్య అమ్మ కుటుంబం ఇక్కడే ఉంటూ వ్యాపారం చేస్తుండడంతో బతుకు దెరువు కోసం నెలక్రితం ఇక్కడికొచ్చారు. అయితే వీరి కుమారుడు డానియెల్‌పై అగంతకుల కన్నుపడింది. ఈ నెల 11న ఉదయం 4.37 గంటల ప్రాంతంలో నల్లటి రంగులో ఉన్న ‘హైదరాబాద్‌ టాప్‌ ఆటో’లో నుంచి దిగిన ఓ వ్యక్తి ఉదయం 5.03 గంటలకు బాబును కిడ్నాప్‌ చేశాడు.

అప్పటికే అక్కడికి చేరుకున్న నంబర్‌ ప్లేట్‌ లేని ఆటోలో బట్టలబజార్‌ బ్రిడ్జి మీదుగా వెళ్లినట్టుగా సీసీ టీవీ పుటేజీలో రికార్డు అయింది. ఆ తర్వాత ఆ ఆటో ఎటు వెళ్లిందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసు కమిషనర్‌ తరుణ్‌ జోషి ప్రత్యేక మార్గదర్శనంలో సెంట్రల్‌ జోన్‌ డీసీపీ పుష్ప, వరంగల్‌ ఏసీపీ గిరికుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలించాయి. అయితే నిందితుల అచూకీ కోసం హైదరాబాద్‌లోనూ గాలించిన పోలీసులకు ఆధారం చిక్కడంతో పట్టుకున్నారు. వీరు డానియెల్‌ను అమ్మడానికే కిడ్నాప్‌ చేసినట్టుగా విచారణలో ఒప్పుకున్నట్లు తెలిసింది. నేడో, రేపో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

చదవండి: తొమ్మిది రోజులైనా కానరాని జాడ.. డానియెల్‌ ఎక్కడ?

మరిన్ని వార్తలు