ప్రేమ పేరుతో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మోసం.. పంచాయితీ పెట్టినా ఫలితం లేదు.. చివరకు

20 Apr, 2022 10:05 IST|Sakshi
దొంగరి సంగీత(ఫైల్‌) 

శాయంపేట (వరంగల్‌) : ప్రేమపేరుతో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వేధింపులను భరించలేని ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహారాపూర్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం.. తహారాపూర్‌ గ్రామానికి చెందిన దొంగరి సంగీత (30) ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఐసీడీఎస్‌ గ్రేడ్‌– 1 సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తోంది.
(చదవండి: భార్యకు చెప్పి.. భర్త ఆత్మహత్య )

హనుమకొండ జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ సర్వేశ్‌యాదవ్‌కు వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. తనకు పెళ్లి కాలేదని సంగీతకు మాయమాటలు చెప్పి ప్రేమపేరుతో నమ్మించాడు. సంగీత బంధువులు అతనికి వివాహమైన విషయం తెలుసుకున్నారు. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి ఇకనుంచి ప్రేమ అంటూ వెంటపడొద్దని తెలిపారు. అయినా అతను మూడు నెలల నుంచి సంగీతకు తరచూ ఫోన్‌ చేస్తూ వేధించసాగాడు. సోమవారం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సంగీతను రాత్రి సర్వేష్‌ యాదవ్‌ ఫోన్‌లో వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై పురుగుల ముందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది.

గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఆటోలో పరకాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సర్వేశ్‌ యాదవ్‌ వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి దొంగరి వీరయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు తెలిపారు. 
(చదవండి: రామాయంపేటలో బంద్‌ ప్రశాంతం)

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు