సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ప్రేమాయణం.. కొద్ది క్షణాల్లో పెళ్లనగా..

21 Nov, 2020 06:57 IST|Sakshi
నవ వధువును తల్లిదండ్రులకు అప్పగిస్తున్న తహసీల్దార్‌ అమరనాథ్‌

రిసెప్షన్‌ అట్టహాసంగా నిర్వహించారు. ఇరుపక్షాల బంధువులు 800మంది పైచిలుకు వచ్చారు. నవ వధూవరులకు ఆశీస్సులూ అందజేశారు. ఉదయాన్నే పెళ్లి..అర్ధరాత్రి అనంతరం కల్యాణ మండపంలోకి పోలీసుల రంగప్రవేశం చేయడంతో కలకలం..అప్పటివరకు నోరు మెదపని నవవధువు తనకీ పెళ్లి ఇష్టం లేదని, తనకో ప్రియుడు ఉన్నాడని బాంబు పేల్చింది! అంతే పెళ్లి ఆగిపోయింది. పోలీసుల పంచాయితీ నడుమ ఆమె తన ప్రియుడి చెంతకు చేరింది. 

సాక్షి, చిత్తూరు(గుర్రంకొండ) : వైఎస్సార్‌ జిల్లా కడపకు చెందిన ఓ యువతి చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తోంది. తన సహచరుడైన చెన్నై యువకుడితో ప్రేమాయణం సాగించింది. అయితే తల్లిదండ్రులకు ఆమె ఈ విషయం చెప్పలేదు. వారు చూసిన పెళ్లి సంబంధానికి అంగీకరించింది. గుర్రంకొండకు చెందిన ఓ ఉద్యోగస్తుడితో వివాహం నిశ్చయించి శుక్రవారం ముహూర్తం పెట్టుకున్నారు. ఇరుపక్షాల నుంచి పెద్ద ఎత్తున బంధుమిత్రులు స్థానిక కల్యాణ మండపానికి వచ్చారు. కోలాహలంగా గురువారం రాత్రి రిసెప్షన్‌ కూడా నిర్వహించారు. అప్పటివరకు సజావుగా సాగిన పెళ్లి తంతు అర్ధరాత్రి 2 గంటల అనంతరం పోలీసుల ప్రవేశంతో ఆగిపోయింది. అసలు విషయం ఏమిటంటే..ఆమె ప్రియుడు తమిళనాడు పోలీసులకు, అక్కడి నుంచి కడప పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  (ప్రియురాలి ప్రవేశం.. మొదటిరాత్రి భగ్నం!)

దీనిపై సమాచారం అందడంతో స్థానిక హెడ్‌కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళా పోలీసులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ఇరుపక్షాల వారికి విషమేమిటో చెప్పారు. నవవధువును ప్రశ్నించడంతో తనకీ పెళ్లి ఇష్టం లేదని తేల్చిచెప్పింది. ఉదయం 8 గంటల వరకు పంచాయితీ చేసినా నవ వధువు ప్రియుడుతో వెళ్లడానికి మొగ్గుచూపింది. దీంతో పెళ్లికొడుకు బృందం కల్యాణ మండపం వదిలి వెళ్లిపోయింది. పోలీసులు నవ వధువును, వారి తల్లిదండ్రులను స్థానిక తహశీల్దార్‌ అమరనాథ్‌ ముందు హాజరుపరిచారు. వారి నుంచి వాంగ్మూలం తీసుకొన్న తహసీల్దార్‌ యువతిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. నాటకీయ పరిణామాల మధ్య మధ్యాహ్నం వేళ ఆమె ప్రియుడు తన స్నేహితులతో కలసి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. చివరకు పోలీసులు ప్రియుడిని, నవవధువు తల్లిదండ్రులను కడపకు పంపించి వేశారు.   (నాకు బతకాలనిపించడం లేదు)

మరిన్ని వార్తలు