నిఖా అయిన నిమిషానికే ప్రియుడితో పెళ్లికూతురు పరార్‌!

19 Sep, 2021 08:38 IST|Sakshi

సాక్షి, పహాడీషరీఫ్‌ (హైదరాబాద్‌): నిఖా పూర్తయిన నిమిషానికే ఓ పెళ్లి కూతురు భర్త ఇచ్చిన మెహర్‌ (కానుకలు)ను తీసుకొని ప్రియుడితో కలిసి పరారైన సంఘటన బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. వివరాలివీ... బెంగుళూర్‌కు చెందిన 28 ఏళ్ల యువకుడికి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వట్టెపల్లిలో నివాసం ఉండే యువతితో ఈ నెల 16న పెద్దల సమక్షంలో వివాహ నిశ్చయమయ్యింది.

అదేరోజు పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులతో కలిసి వివాహ స్థలమైన బాలాపూర్‌లోని షాహిన్‌నగర్‌కు చేరుకున్నారు. బాగా అలసిపోయామంటూ 17వ తేదీకి నిఖాను వాయిదా వేశారు. 17వ తేదీన ఖాజీ సమక్షంలో నిఖా జరిగాక... ఆనవాయితీ ప్రకారం మెహర్‌ కింద పెళ్లి కుమారుడు తన భార్యకు రూ. 50 వేలతో పాటు రూ. 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అందజేశారు.

అనంతరం జరగాల్సిన కార్యానికి ముస్తాబయ్యేందుకు బ్యూటీ పార్లర్‌కు వెళ్లొస్తానంటూ పెళ్లి కుమార్తె బయటికి వెళ్లింది. గంట.. రెండు గంటలవుతున్నా ఆమె రాలేదు. దీంతో పెళ్లి కొడుకు ప్రశ్నించడంతో పెళ్లికుమార్తె తల్లి విషయం బయటపెట్టింది. తన కుమార్తె తమకే తెలియకుండా తన ప్రియుడితో కలిసి వెళ్లిందని వెల్లడించింది. దీంతో పెళ్లి కొడుకు తరఫు వారు ఆందోళనకు దిగారు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తామనడంతో చివరకు వధువు ఇంటి వారు మెహర్‌ కింద అందించిన సొమ్మును అప్పగిస్తామని వేడుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. తనకు ఇవ్వాల్సిన కట్నం ఇవ్వలేదంటూ చివరకు ఖాజీ కూడా ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందనందున కేసు నమోదు చేయలేదని బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.భాస్కర్‌ తెలిపారు.   

చదవండి: Raj Kundra: నీలిచిత్రాల కేసులో నేనే బలిపశువును: రాజ్‌ కుంద్రా

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు