బెయిల్‌ పై విడుదలైన నేరస్తుడికి ఘనస్వాగతం...83 మంది అరెస్టు

18 Jun, 2022 18:03 IST|Sakshi

కొంతమంది నేరస్తులకు అరెస్టు అయినా భయం ఉండదు. జైలుకి వెళ్లడం అంటే ఏదో ఘన కార్యం చేసినట్లుగా ఫీలవుతారు. వాళ్లకి పొరపాటున బెయిల్‌ వచ్చి విడుదలైతే...వాళ్ల సహచరులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు.  అచ్చం అలానే ఇక్కడొక నేరస్తుడికి కూడా అతని సహచరులు ఇలానే హడవిడి చేసి కటకటాల పాలయ్యారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే....ఢిల్లీలో బెయిల్‌ పొందిన ఒక నేరస్తుడుకి ఘన స్వాగంత పలికి ఇతరులను ఇబ్బంది పెట్టినందుకు గానూ సుమారు 83 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం....తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్ నివాసి, గోవింద్‌పురి పోలీస్ స్టేషన్‌కు చెందిన నేరస్థుడు తీహార్‌ జైల్‌ నుంచి బెయిల్‌ పై విడుదలయ్యాడు. దీంతో అతనికి స్వాగతం పలికేందుకు పేరుమోసిన నేరస్తులు, సహచరులు తీహార్‌ జైలు వద్దకు వచ్చారు.

ఈ మేరకు వారంతా ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియా మీదుగా 'షో ఆఫ్ పరేడ్(స్వాగతం ర్యాలీ)'ని నిర్వహించి మరీ ఆ నేరస్తుడుని ఘనంగా తీసుకువెళ్లారు. అక్కడ ఉండే స్థానికులను ఇబ్బంది పెట్టేలా గోల చేస్తూ... ఆ నేరస్తుడిని ఊరేగిస్తూ తీసుకువెళ్లారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని...19 వాహానాలను, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకోవడమే కాకుండా సుమారు 83 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

(చదవండి: రోడ్డు బంద్‌ చేసి మరీ ట్రాఫిక్‌ ఏసీపీ మార్నింగ్‌ వాక్‌! మండిపోయిన ప్రజలు ఏం చేశారంటే..)

మరిన్ని వార్తలు