తాగిన మైకంలోనే నీరజ్‌ హత్యకు స్కెచ్‌.. చంపినవాళ్లను అరెస్ట్‌ చేశాం: డీసీపీ

21 May, 2022 21:00 IST|Sakshi

హైదరాబాద్‌: సరూర్‌ నగర్‌ ఘటన తరహాలోనే సంచలనం సృష్టించింది చర్చనీయాంశంగా మారింది బేగంబజార్‌ పరువు హత్య. ఈ కేసులో నిందితులను అరెస్ట్‌ చేసినట్లు నగర వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌ వెల్లడించారు. శనివారం సాయంత్రం ప్రెస్‌ మీట్ నిర్వహించిన ఆయన.. కేసు పురోగతి వివరాలను వెల్లడించారు. ఈ ఉదంతంలో మధ్యవర్తుల ద్వారా నిందితులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించినట్లు తెలిపిన డీసీపీ.. గంటల వ్యవధిలోనే ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. 

గతేడాది ఏప్రిల్‌లో సంజన, నీరజ్‌ పన్వార్‌లు షంషీర్‌గంజ్‌లోని సాయిబాబా ఆలయంలో ప్రేమపెళ్లి చేసుకున్నారు. వీళ్ల వివాహం పెద్దలకు ఇష్టం లేదు.. ఒప్పుకోలేదు. దీంతో వీళ్లిద్దరూ ఫలక్‌నుమాలోని షంషీర్‌గంజ్‌లో కాపురం పెట్టారు. నీరజ్‌ వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో సంజన​ బంధువులు నీరజ్‌పై కక్ష పెంచుకున్నారు.  తాగిన మైకంలో ఈ నేరం చెయ్యాలి అని అనుకున్నారని తెలిపారు. 

ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతాలో హైదరాబాద్ బేగంబజార్ మార్కెట్ వద్ద నీరజ్ పన్వర్ అలియాస్‌ బంటీపై హత్యకు స్కెచ్‌ గీశారు. నీరజ్‌ తన తాతయ్యతో కలిసి బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్తుండగా యాదగిరి గల్లి, చేపల మార్కెట్ వద్ద అతడిని ఆపి కత్తులు, బండరాళ్లతో దాడికి పాల్పడ్డారు.  తీవ్ర రక్తస్రావానికి గురై ఓజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు నీరజ్‌.

నిందితులను.. అభినందన్ యాదవ్, విజయ్ యాదవ్,  సంజయ్ యాదవ్, రోహిత్ యాదవ్, మహేష్ అహీర్ యాదవ్‌తో పాటు ఒక మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నీరజ్‌ను ఆరుగురు కలిసే చంపారని డీసీపీ వెల్లడించారు. నగర సీపీ ఆదేశాల మేరకు ఏడు బృందాలను ఏర్పాటుచేయగా.. షాహినాయత్‌గంజ్ పోలీసులు 24 గంటల్లో నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ వెల్లడించారు.

మరిన్ని వార్తలు