ఎస్సై మహేందర్‌ వేధింపులతోనే నా భర్తకు గుండెపోటు

23 Nov, 2021 10:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బాధితురాలి ఆరోపణ

సాక్షి,చిల్పూరు(వరంగల్‌): వేలేరు మండలంలో జరిగిన ఓ రైతు ఆత్మహత్య కేసులో తమను లక్ష్యంగా చేసుకుని చిల్పూరు ఎస్సై మహేందర్‌ నిత్యం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించుకుని వేధించడం వల్లే తన భర్తకు గుండెపోటు వచ్చిందని బాధితురాలు మిస్టరీ బేగ్‌ ఆరోపించడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. వేలేరు మండలం గుండ్లసాగరం గ్రామానికి చెందిన ఖాసింకు, చిల్పూరు మండలం వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన వలీకి కొన్నేళ్లుగా భూతగాదాలు ఉన్నాయి. ఈవిషయంలో గత నెలలో ఖాసిం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

తన ఆత్మహత్యకు వలీ కారణమంటూ మరణ వాంగ్మూలం రాశాడని మృతుడి బంధువులు ఆరోపించారు. విచారణ చేపట్టిన చిల్పూరు పోలీసులు కేసును వేలేరు పీఎస్‌కు బదిలీ చేశారు. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వలీని విచారణ నిమిత్తం చిల్పూరు పీఎస్‌కు పిలిచారు. ఇలా ప్రతీ రోజు రమ్మనడంతో వలీకి వారం రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఎస్సై వేధింపులవల్లే తన భర్త ఆస్పత్రి పాలయ్యాడని వలీ భార్య మిస్టరీ బేగ్‌ సోమవారం ఆరోపణలు చేసింది. 

ఆరోపణలు అవాస్తవం..
రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వలీ ప్రమేయం ఏదైనా ఉందనే విషయంలో పీఎస్‌కు పిలిపించానే తప్ప వారిని వేధించలేదని ఎస్సై మహేందర్‌ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించడంతో కేసు నమోదు చేసి వేలేరు పీఎస్‌కు బదిలీ చేశామాన్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక అందించానని ఎస్సై తెలిపారు.  

మరిన్ని వార్తలు