క్లిక్‌ చేస్తే రూ.2.67 లక్షలు కొల్లగొట్టారు!

2 Jan, 2022 03:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పశ్చిమ గోదావరి జిల్లాలో ఘటన

ఆకివీడు: వాట్సాప్‌లో వస్తున్న లింక్‌ మెసేజ్‌లు బ్యాంకు ఖాతాదారుల ఖాతాలను ఖాళీ చేస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని దుంపగడప గ్రామ శివారు పల్లెపాలెం వాసి కొల్లేటి హరిబాబుకు ఇలాంటి ఘటనే ఎదురైంది. దీంతో శనివారం ఆకివీడు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం మేరకు..హరిబాబుకు స్థానిక స్టేట్‌బ్యాంకులో ఖాతా ఉంది. ‘ఎకౌంట్‌ బ్లాక్‌ అయింది.

లింక్‌ను క్లిక్‌ చేయండి’ అంటూ డిసెంబర్‌ 15న మెసేజ్‌ రావడంతో ఆ లింక్‌ను క్లిక్‌ చేశాడు. అనంతరం అతని ఖాతాలో ఉన్న రూ.2,67,928 నగదు వేరే ఖాతాకు జమ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో అతడు బ్యాంకు అధికారులను సంప్రదించాడు. అక్కడి నుంచి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని కోరుతూ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చెప్పాడు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ బీవై కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఇటువంటి మెసేజ్‌లను ఓపెన్‌ చేయవద్దని, లింక్‌లను నమ్మవద్దని, వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దని ప్రజలకు సూచించారు. 

మరిన్ని వార్తలు