దారుణం: లిఫ్టు అడిగినందుకు వితంతువుకు గుండు చేయించారు

3 Aug, 2021 20:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అహ్మదాబాద్‌: ఓ వితంతువు.. వివాహితుడైన వ్యక్తిని లిఫ్టు అడిగి బైక్‌ మీద అతనితో ప్రయాణించినందుకు ఆరుగురు వ్యక్తులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. అనంతరం గ్రామంలోకి తీసుకువెళ్లి శిరోముండనం చేశారు. ఈ దారుణమైన ఘటన గత శుక్రవారం గుజరాత్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సబర్కాంత జిల్లాలోని సంచేరి గ్రామానికి చెందిన ఓ వితంతు మహిళ.. తన ఇద్దరు కుమారులకు సంబంధించిన ఆధార్‌  కార్డులను బ్యాంక్‌ ఇవ్వడానికి హిమ్మత్‌ నగర్‌ పట్టణానికి వెళ్లారు. పని ముగించుకున్న ఆమె తిరిగి సంచేరి గ్రామానికి బయలుదేరారు. అయితే మార్గ మధ్యలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఆమె లిఫ్టు అడిగింది. తెలిసిన మహిళ కావటంతో అతను ఆమెకు లిఫ్టు ఇచ్చాడు.

గ్రామానికి వస్తున్న క్రమంలో రాయ్‌గడ్‌ గ్రామం వద్ద ఆరుగురు వ్యక్తులు ఒక్కసారిగా బైక్‌ను అడ్డగించి మహిళపై దాడిచేశారు. ఆమె దుస్తులు చించేశారు. తర్వాత వారిని గ్రామంలోకి తీసుకోవచ్చి.. ఆ వితంతు మహిళకు శిరోముండనం చేశారు. ఆమె సదరు వ్యక్తితో రహస్య సంబంధం పెట్టుకుందని ఆగ్రహంతో దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. అందులో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళల ఉన్నారు. ఆ మహిళకు లిఫ్టు ఇచ్చిన వ్యక్తి.. నిందితుల్లోని ఓ మహిళ సోదరికి భర్త అని పోలీసులు గుర్తించారు. 

మరిన్ని వార్తలు