ప్రభుత్వ ఉద్యోగ దంపతుల ఆత్మహత్య

4 Sep, 2020 08:24 IST|Sakshi

సాక్షి, చిలకలగూడ : కుటుంబ సమస్యల కారణంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య బాత్‌రూంలో  ఆత్మహత్యకు పాల్పడగా, బెడ్‌రూంలో బలవన్మరణం పొందాడు. ఈ సంఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బౌద్ధనగర్‌ డివిజన్‌ అంబర్‌నగర్‌లో గురువారం జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. సికింద్రాబాద్‌ అంబర్‌నగర్‌కు చెందిన తిరుమల వెంకటేష్‌ (30), దండె భార్గవి (24) భార్యాభర్తలు. 2015లో వీరికి వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె మోక్షశ్రీ, మూడు నెలల కుమారుడు అన్విక్‌లున్నారు. పుత్లిబౌలిలోని విద్యుత్‌ కార్యాలయంలో సబ్‌ ఇంజనీర్‌గా వెంకటేష్, కృష్ణజిల్లా జగ్గయ్యపేట పోస్ట్‌ఆఫీస్‌లో పోస్ట్‌ఉమెన్‌గా భార్గవి పనిచేస్తున్నారు.  వెంకటేష్‌ తల్లి మృతి  చెందడంతో తండ్రి బాలకృష్ణ మరో పెళ్లి చేసుకున్నాడు. బాలకృష్ణకు ఇద్దరు కుమార్తెలు, నలుగురు కుమారులు. వీరిలో పెద్దకుమారుడు వెంకటేష్‌. తన భార్య పిల్లలతో కలిసి తండ్రి ఇంటి ఎదురుగానే మరో ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఇద్దరు నెలవారీ జీతాలను తనకే ఇవ్వాలని, కుటుంబ పోషణ భారమవుతుందని తండ్రి బాలకృష్ణ తరచూ గొడవపడేవాడు. గతనెల 31వ తేదిన వెంకటేష్‌ తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు.  తనకు ఇవ్వకుండా జల్సాలు చేస్తున్నాడని భావించిన తండ్రి డబ్బు కోసం మరింత ఒత్తిడి తెచ్చాడు. దీంతో భార్యభర్తలు తీవ్ర మానసిన వేదనకు గురయ్యారు. నేను నమ్మిన వాళ్లే నన్ను మోసం చేశారు. అమ్మా నన్ను క్షమించి, పిల్లలను బాగా చూసుకో అని భార్గవి సూసైడ్‌నోట్‌ రాసి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాత్‌రూంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య బలవన్మరణాన్ని చూసి తట్టుకోలేని వెంకటేష్‌ బెడ్‌రూం దూలానికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం మూడు నెలల బాబు గుక్కపట్టి ఏడుస్తున్నా ఇంటి లోపలి నుంచి ఎటువంటి అలికిడి లేకపోవడం, ఎంత కొట్టినా తలుపులు తీయకపోవడంతో స్థానికుల సహాయంతో కిటికీ నుంచి లోపలకు వెల్లి చూడగా భార్యభర్తలు వేర్వేరుగా ఉరికి వేలాడుతు కనిపించారు.

మృతుల కుటుంబసభ్యులు ఒకరినొకరు దూషించుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.  గోపాలపురం ఏసీపీ వెంకటరమణ, చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, సెక్టార్‌ ఎస్‌ఐ వరుణ్‌కాంత్‌రెడ్డిలు ఘటనస్థలానికి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు.  వెంకటేష్‌ కుటుంబసభ్యులైన తిరుమల బాలకృష్ణ, లక్ష్మీ, రవి, సంతోష్, వజ్రమ్మ, రాణి, భాగ్యలే తన కుమార్తె, అల్లుడు ఆత్మహత్యకు కారణమని మృతురాలు భార్గవి తండ్రి రాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు, కోడలును డబ్బులు కోసం వేధించలేదని, ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో తెలియదని మృతుడు వెంకటేష్‌ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు.

మరిన్ని వార్తలు