భర్త దోపిడీ వెనుక భార్య.. ఐదుకోట్లు స్వాహా

19 Nov, 2020 08:50 IST|Sakshi
నిందితులు పబంతి ప్రభాకర్, సరిత

తప్పుడు పత్రాలతో ఇండియన్‌ బ్యాంక్‌కు టోకరా వేసిన దంపతులు

తప్పించుకుని తిరుగుతూ ఎట్టకేలకు పట్టుబడిన వైనం

షాద్‌నగర్‌ టౌన్‌ : తప్పుడు పత్రాలతో రుణాలు కొట్టేస్తూ, రియల్టర్లతో అగ్రిమెంట్లు కుదుర్చుకుని డబ్బు ఎగ్గొట్టే నైజం ఆ భర్తది. ఆ మోసాలకు వంతపాడే పాత్ర అతని భార్యది. ఇలా వీరిద్దరూ కలిసి రూ.5 కోట్లకు ఇండియన్‌ బ్యాంకుకే ఎసరుపెట్టారు. చివరకు గుట్టురట్టయి పోలీసులకు చిక్కారు. ఈ ఉదంతం వివరాలను బుధవారం షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ విలేకరులకు వివరించారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం బూర్గుల గ్రామానికి చెందిన పబంతి ప్రభాకర్, సరిత దంపతులు హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ఉంటున్నారు. వీరిద్దరూ ప్రొప్రెయిటర్లుగా సాయి ప్రాపర్టీ డెవలపర్స్‌ సంస్థను ఏర్పాటుచేసి షాద్‌నగర్, నాగోల్, బండ్లగూడ, రాజేంద్రనగర్, నార్సింగ్, ఫతుల్లాగూడ ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. భూములను కొని వాటిని వెంచర్లుగా చేసి అమ్మేవారు. అయితే ఇవి గ్రామాలకు చివరన ఉండటంతో అమ్ముడుపోక.. అప్పుల ఊబిలో కూరుకుపోయారు.

మోసానికి తెరలేచిందిలా..
షాద్‌నగర్‌ పరిధి సోలీపూర్‌ గ్రామ శివారులో ప్రభాకర్‌ దంపతులు కొన్నేళ్ల క్రితం 25 ఎకరాల భూమిని కొని వెంచర్‌ వేసి, ప్లాట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందుకు అవసరమైన రుణం కోసం 2015లో షాద్‌నగర్‌లోని ఇండియన్‌ బ్యాంక్‌ను ఆశ్రయించారు. ఇళ్లు అమ్మినట్లు బ్యాంకు వారిని తప్పుదోవ పట్టించడంతో పాటు బోగస్‌ వ్యక్తుల్ని, వారి ఆధార్‌కార్డులను, జీతాల ధ్రువీకరణ పత్రాల నకళ్లు సృష్టించి.. విడతలవారీగా రూ.5 కోట్లకుపైగా రుణం పొందారు. ఫతుల్లాగూడలో దివాకర్‌సింగ్‌కు చెందిన 9 ఎకరాల భూమిని కొనేందుకు అగ్రిమెంట్‌ చేసుకున్న వీరు అతనికి డబ్బులు సరిగా చెల్లించలేదు. అపార్ట్‌మెంట్‌ నిర్మాణదారుడు కిరణ్‌కుమార్‌రెడ్డిని కూడా మోసం చేశారు. ఇలాగే మరికొన్ని మోసాలకు పాల్పడిన వీరిపై అబ్దుల్లాపూర్‌మెట్, కేపీహెచ్‌బీ, రాజేంద్రనగర్, మాదాపూర్, నార్సింగ్‌ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. మరోపక్క ప్రభాకర్‌ దంపతులు ఎంతకీ రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు.. రుణపత్రాలను పరిశీలించారు.

మోసం చేశారని గుర్తించి గత అక్టోబర్‌లో బ్యాంకు మేనేజర్‌ మహేందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన పోలీసులు ప్రభాకర్‌ దంపతులను అరెస్టు చేసేందుకు ఈనెల 17 రాత్రి టోలీచౌకిలోని వారి విల్లాకు వెళ్లారు. ప్రభాకర్‌ బంధువులు, సన్నిహితులు పోలీసులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. షాద్‌నగర్‌ పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్, సిబ్బంది చాకచక్యంగా వారిని అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. అడ్డుకున్న వారిపై కూడా గోల్కొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కాగా, ప్రభాకర్‌ దంపతులు చేసిన అప్పులను తీర్చేందుకు మరికొన్ని అప్పులు చేస్తూ చిట్టీల వ్యాపారం చేసే వారని, ఇలా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని ఏసీపీ సురేందర్‌ తెలిపారు. విలాసవంతమైన విల్లా, కార్లు, బైకులు కొన్నారని, ప్రభాకర్‌ చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడని చెప్పారు.

మరిన్ని వార్తలు