భర్తను పచ్చడి బండతో కొట్టి చంపిన భార్య

31 Jul, 2022 16:25 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చల్లపల్లి(కృష్ణా జిల్లా): ఆముదార్లంక గ్రామంలో భర్తను పచ్చడి బండతో కొట్టి చంపిన భార్యను పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. చల్లపల్లి సీఐ బి. భీమేశ్వర రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఆముదార్లంకలో కళ్లేపల్లి వెంకట సుబ్బారావును అతని భార్య వీరకుమారి తనను పదేపదే అనుమానిస్తున్నాడనే కోపంతో పచ్చడి బండతో తలపై కొట్టి చంపింది. దంపతులిద్దరి మధ్య గతం నుంచి గొడవలు ఉన్నాయి. ఏడు నెలల కిందట పుట్టింటికి వెళ్లిపోగా పెద్దల రాజీ ప్రయత్నంతో మళ్లీ కాపురానికి వచ్చింది.
చదవండి: చంద్రగిరి కొండ.. అంతుచిక్కని ఎన్నో వింతలు, విశేషాలు

గ్రామస్తులతో సన్నిహితంగా మెలిగినా, ఫోనులో మాట్లాడినా ఆమెను సుబ్బారావు మందలిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే గురువారం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ఆగ్రహానికి గురైన వీరకుమారి ఇంట్లో ఉన్న పచ్చడిబండతో భర్త కళ్లేపల్లి వెంకట సుబ్బారావు తలపై బలంగా కొట్టింది. ఈ గాయంతో సుబ్బారావు శుక్రవారం ఉదయాన్నే మృతి చెంది కనిపించాడు. మృతుని తల్లి నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపి సుబ్బారావు మృతికి కారకురాలైన వీరకుమారిని అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు.    

మరిన్ని వార్తలు