ప్రియుడి మోజులో భర్త హత్య 

24 Sep, 2020 13:00 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీఐ తిరుమల్‌

సాక్షి, నెక్కొండ: ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిందో మహిళ. శవాన్ని  కాల్చి.. బూడిదను చెరువు లో కలిపి ఆనవాళ్లు లేకుండా చేసేందుకు యత్నించింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండలో జరిగింది. సీఐ తిరుమల్‌ కథనం ప్రకారం.. మండలంలోని గొల్లపల్లి శివారు గేటుపల్లికి చెందిన బాదావత్‌ ధర్యావత్‌ సింగ్‌ (42), జ్యోతి దంప తులకు ఇద్దరు సంతానం. సింగ్‌ హన్మకొండ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తుండగా.. జ్యోతి స్థానికంగా టైలరింగ్‌ శిక్షణ ఇస్తోంది. ఈ క్రమంలో మండలంలోని అప్పల్‌రావుపేటకు చెందిన సాంబరాజుతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్లకు ఈ విషయం భర్త సింగ్‌కు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఆగస్టు 21 నుంచి ధర్యావత్‌ సింగ్‌ ఇంట్లోనే ఉంటుండటంతో జ్యోతికి సాంబరాజును కలవడం సాధ్యం కావడం లేదు. ఎప్పటికైనా ఈ సమస్య ఎదురవుతుందని భావించిన ఆమె.. భర్తను హత్య చేయాలని నిర్ణయించింది. ప్రియుడితో కలసి పథకం పన్నింది. 

హత్య, ఆపై దహనం 
ఈనెల 14న రాత్రి మద్యం మత్తులో ఉన్న భర్తను హతమార్చేం దుకు ఇదే సరైన సమయమని భావించిన జ్యోతి.. సాంబరాజుకు సమాచారం ఇచ్చింది. దీంతో అతను ట్రాలీ ఆటోలో నెక్కొండకు వచ్చాడు. తాడును సింగ్‌ మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం తన పత్తి చేను వద్దకు మృతదేహాన్ని తరలించాడు. అప్పటికే అక్కడ ఉన్న సాంబరాజు తండ్రి యాకయ్య, సోదరుడు సురేశ్‌ సాయంతో శవాన్ని పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మరుసటి రోజు ఉదయం వెళ్లి చూడగా శవం సగమే కాలింది. దీంతో మళ్లీ దహనం చేశారు. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు 16న బూడిద, అస్థికలను మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం దర్గా చెరువులో కలిపారు.  

గుట్టురట్టు చేసిన కాల్‌డేటా.. 
మృతుడి సోదరుడు వీరన్న ఫిర్యాదు మేరకు  దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జ్యోతి కదలికలపై నిఘా పెట్టి.. ఆమె సెల్‌ఫోన్‌ కాల్‌డేటా ను సేకరించారు. సాంబరాజుతో మాట్లాడిన సంభాషణల ఆధారంగా జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. సాంబరాజు, జ్యోతిని అరెస్టు చేశారు. సాంబరాజు తండ్రి యాకయ్య, సోదరుడు సురేశ్‌ పరారీలో ఉన్నారు.

మరిన్ని వార్తలు