వివాహేతర సంబంధం:  ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య 

4 Nov, 2022 07:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గంగవరం(చిత్తూరు జిల్లా): పెద్దపంజాణి మండలం ఇటుక నెల్లూరు వద్ద రెండు రోజుల క్రితం జరిగిన దామోదరం హత్య కేసులో నిందితులుగా ఉన్న మృతుడి భార్య అనూరాధ, ఆమె ప్రియుడు గంగరాజును పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రియుడితో కలిసి భార్యే హత్య చేసినట్లు నిర్ధారించారు. గురువారం గంగవరం పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ గంగయ్య వివరాలను వెల్లడించారు. పుంగనూరు మండలం బత్తలాపురం గ్రామానికి చెందిన దామోదర్‌కి, పెద్దపంజాణి మండలం పెనుగొలకలకి చెందిన అనురాధతో ఏడాది క్రితం వివాహమైంది. దామోదరం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.
చదవండి: బీజేపీ ఎమ్మెల్యేకు షాక్‌.. వాట్సాప్‌లో యువతి న్యూడ్‌ వీడియో కాల్‌చేసి.. 

వివాహ సమయంలో అనురాధాకు అత్తింటి వారే నగలు పెట్టి పెళ్లి చేసుకున్నారు. వివాహానికి ముందే అనురాధకు నాగిరెడ్డిపల్లికి చెందిన గంగరాజుతో వివాహేతర సంబంధం ఉంది. అతనికి ఇది వరకే కొత్తపల్లికి చెందిన మహిళతో వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వివాహం అనంతరం అనురాధ తన భర్తతో సక్రమంగా కాపురం చేసేది కాదు. కాగా అత్తింటివారు పెట్టిన నగలను కొన్ని నెలల తరువాత భర్తకు తెలియకుండా ప్రియుడి అవసరార్థం ఇచ్చింది. కొన్నాళ్ల తరువాత పుంగనూరు పట్టణంలో సైటు కొనేందుకు కొంత నగదు సరిపోకపోవడంతో నగలను ఇవ్వమని అనురాధను అడగడంతో పుట్టింటిలో ఉన్నాయంటూ తప్పించుకుంది.

అలా అడిగిన ప్రతిసారి సరైన సమాధానం ఇచ్చేది కాదు. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్‌ వేసింది. ఈ దీపావళి పండుగ (ఈ నెల 24)న భార్య భర్తలిద్దురూ అత్తింటికి వెళ్లారు. పండుగ ముగించుకుని రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తాము వస్తున్న లొకేషన్‌ గురించి ప్రియుడికి తరచూ సెల్‌ఫోన్‌లో మెసేజీలు పెట్టుకుంటూ వచ్చింది. తరువాత తుర్లపల్లి గ్రామ సమీపంలో నాగలాకుంట చెరువు కట్టపై వెళ్లగానే గంగరాజు వాహనాన్ని ఆపాడు.

దామోదరం కళ్లలో కారం కొట్టి తల, శరీర భాగాల్లో కత్తితో దాడి చేసి పారిపోయాడు. గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తను హతమార్చి నగలు దోచుకెళ్లారంటూ అనురాధ కథ అల్లింది. అందురూ నిజమనే అనుకున్నారు. అనుమానంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలిసులు హత్యకు వినియోగించిన కత్తి, బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.   

మరిన్ని వార్తలు