వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. కట్టుకున్న భర్తను..

20 Jun, 2021 10:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, స్టేషన్‌ఘన్‌పూర్‌: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా భర్తను ప్రియుడితో కలిసి భార్యహత్య చేయించిన ఘటన స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం నమిలిగొండ గ్రామంలో ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. దీంతో పోలీసులు బావినుంచి మృతదేహాన్ని వెలికితీయడంతో పాటు నిందితులను అరెస్టు చేశారు. ఈ విషయమై పోలీసుస్టేషన్‌లో స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీ వైభవ్‌గైక్వాడ్, సీఐ ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. 

నమ్మించి.. మద్యం తాగించి
హైదరాబాద్‌ ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌కు చెందిన ఆకుల మహేష్‌ – అశ్విని దంపతులకు ఏడు నెలల కుమారుడు ఉన్నాడు. అశ్వినికి గతంలో మరో వ్యక్తితో వివాహం కాగా ఆయన చనిపోయాక మహేష్‌ను పెళ్లిచేసుకుంది. మహేష్‌ జోడుమెట్ల పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా అశ్విని ఘట్‌కేసర్‌లో పూలు అమ్మేది. స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం మీదికొండకు చెందిన పశుల కుమార్‌ కొన్నేళ్లుగా ఘట్‌కేసర్‌లో ఆటో నడుపుతుండగా ఆయనతో అశ్వినికి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయమై మహేష్, అశ్వినికి తరచుగా గొడవలు జరుగుతున్నాయి. మహేష్‌ అడ్డు తొలగించాలని కుమార్, అశ్విని పథకం వేసుకున్నారు.

మహేష్‌తో పశుల కుమార్‌ పరిచయం ఏర్పర్చుకుని తమ గ్రామంలో ఫంక్షన్‌కు వెళ్దామని నమ్మించాడు. ఈనెల ఐదో తేదీన పెట్రోల్‌బంక్‌లో ఉదయం తొమ్మిది గంటలకు డ్యూటీ దిగిన మహేష్‌.. కుమార్‌తో కలిసి కారులో స్టేషన్‌ఘన్‌పూర్‌ వచ్చారు. నమిలిగొండకు చెందిన వరసకు బావమరిది అయిన పల్లెపు కృష్ణ కుమార్‌కు నమిలిగొండ వస్తున్నట్లు తెలిపారు. ఇక్కడకు వచ్చాక ముగ్గురు గ్రామ శివారులోని ఓ రేకుల కొట్టం సమీపాన మద్యం తాగాక మత్తులో ఉన్న మహేష్‌ తలపై రాత్రి 11 గంటలకు కుమార్‌ బండరాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం బావమరిది సాయంతో ఖాళీ గోనె సంచిలో మహేష్‌ మృతదేహాన్ని మూటగట్టి సమీపంలో ఉన్న పాడుబడిన వ్యవసాయ బావిలో పడేసి వెళ్లిపోయారు. 

ఘట్‌కేసర్‌లో మిస్సింగ్‌ కేసు
ఈనెల ఐదున హైదరాబాద్‌ జోడుమెట్ల పెట్రోల్‌బంక్‌ నుంచి వెళ్లిన మహేష్‌ తిరిగి రాలేదు. హత్య చేసినట్లు భార్య అశ్వినికి తెలిసినా ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు నటించసాగింది. చివరకు ఆయన సోదరులు, బంధువులతో కలిసి ఈనెల ఏడున ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానీ ఘట్‌కేసర్‌ పోలీసుల విచారణలో అశ్వినిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం బయటపడింది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసినట్లు చెప్పిన ఆమె, కుమార్‌ స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం మీదికొండ గ్రామంలో ఉన్నట్లు విచారణలో వెల్లడించింది.

దీంతో ఘట్‌కేసర్‌ ఎస్‌ఐ స్టేషన్‌ఘన్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌కు శనివారం చేరుకుని స్థానిక సిబ్బంది సాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఒప్పుకున్నాడు. ఆ వెంటనే నిందితులు చెప్పిన సమాచారం మేరకు వ్యవసాయ బావి వద్దకు ఘన్‌పూర్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ రమేష్‌నాయక్‌ వెళ్లి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీయించారు. డీసీపీ శ్రీనివాసరెడ్డి, జనగామ ఏసీపీ వినోద్‌కుమార్, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏసీపీ వైభవ్‌ రఘునాధ్‌ గైక్వాడ్‌ చేరుకుని నిందితులు కుమార్, కృష్ణను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు