ప్రియునితో కలసి భర్త హత్య?

18 Aug, 2020 07:46 IST|Sakshi
భర్తను చంపి ఇంట్లో పూడ్చిపెట్టినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్న ఇల్లు

చెరుకుపల్లిలోని ఇంట్లో పూడ్చిపెట్టి కొల్లూరులో ప్రియునితో సహజీవనం 

మృతుని తండ్రి ఫిర్యాదుతో పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసులు

చెరుకుపల్లి(రేపల్లె): మండల కేంద్రమైన చెరుకుపల్లిలో వ్యక్తి అదృశ్యమైన కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. మూడు నెలలుగా తన కుమారుడు బల్లేపల్లి చిరంజీవి కనిపించటం లేదని మండల కేంద్రమైన చెరుకుపల్లికి చెందిన  బల్లేపల్లి  సుబ్బారావు వారం రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విచారణలో చిరంజీవి భార్య కొల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో కలిసి అక్కడ సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. పోలీసులు ఆమెను విచారించగా నిర్ఘాంత పోయే విషయాలు వెలుగుచూసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మూడు నెలల క్రితం ప్రియునితో కలిసి భర్తను హత్య చేసి చెరుకుపల్లిలో అద్దెకు ఉంటున్న ఇంట్లోనే పూడ్చి వేశారని తెలుస్తోంది. అనంతరం ఆ ఇంటికి తాళం వేసి కొల్లూరు గ్రామానికి వెళ్లి ప్రియునితో సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. చిరంజీవిని హతమార్చటంలో సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

చిరంజీవికి రెండో భార్య 
చిరంజీవి మొదటి భార్యతో వివాదం రావటంతో కోర్టులో కేసు నడుస్తోంది. ఈ సమయంలోనే ఇంటూరుకు చెందిన యువతిని ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.  వీరికి ఒక కుమారుడు జన్మించాడు. చిరంజీవికి కొల్లూరులో మెడికల్‌ షాపు ఉండేది. ఆ సమయంలో కొల్లూరుకు చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పడింది. చిరంజీవికి స్నేహితుడిగా ఉన్న వ్యక్తితో అతని భార్య వివాహేతర సంబంధం ఏర్పరుచుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలో చిరంజీవి ఇటీవల స్థలం అమ్మగా రూ.20 లక్షలు వచ్చాయని, వాటిని ఇంట్లో భద్రపరచగా, అదే రోజు ప్రియునితో కలిసి చిరంజీవిని హత్య చేసి ఆ సొమ్ముతో కొల్లూరు వెళ్లిపోయి ప్రియునితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసులో పరోక్షంగా, ప్రత్యక్షంగా సహకరించిన వారిని పోలీసులు విచారిస్తున్నారు. 

భయాందోళన చెందుతున్న గ్రామస్తులు 
చిరంజీవిని పాతిపెట్టారని భావిస్తున్న ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తుండటంతో స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.  ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోవటంపై స్థానికులు కలవరపడుతున్నారు.  

త్వరలో వివరాలు వెల్లడిస్తాం 
దీనిపై రేపల్లె రూరల్‌ సీఐ బి. శ్రీనివాసరావును వివరణ కోరగా వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసును మరింత వేగవంతం చేసి దర్యాప్తు చేపడుతున్నామని, నిజానిజాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.   

మరిన్ని వార్తలు