డబ్బు వివాదం: కుటుంబంతో కలిసి భర్త హత్య

10 Feb, 2021 15:04 IST|Sakshi
వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ

డబ్బుల విషయంలో వివాదం 

కుటుంబ సభ్యులతో కలిసి భర్తను హతమార్చిన భార్య 

గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులు 

సాక్షి, జిన్నారం(పటాన్‌చెరు): డబ్బుల విషయంలో వివాదంతో అయినవారే అంతమొందించిన సంఘటన బొల్లారం మున్సిపల్‌ పరిధిలో చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి ముళ్లపొదల్లో పడేసి కాల్చేసిన కేసును పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించడం విశేషం. వివరాలను డీఎస్పీ భీంరెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్‌ పరిధిలోని బాలాజీనగర్‌లో నివసిస్తున్న విజయ్‌సింగ్‌ (42), మల్లీశ్వరి దంపతులు. 16 ఏళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. వీరికి 14ఏళ్ల కుమార్తె ఉంది. విజయ్‌సింగ్‌ తన కుమార్తె పేరుపై రూ.లక్షను బ్యాంక్‌లో ఫిక్స్‌డ్‌ చేశాడు. నామినీగా మల్లీశ్వరిని ఉంచాడు.

నెల రోజుల క్రితం భర్తకు తెలియకుండా మల్లీశ్వరి బ్యాంక్‌లో ఉన్న రూ.లక్షను తెచ్చి తన తమ్ముడైన మంద కృష్ణకు అప్పుగా ఇచ్చింది. కొద్దిరోజుల తర్వాత విషయం విజయ్‌సింగ్‌కు తెలిసింది. తనకు తెలియకుండా డబ్బులు ఎందుకు ఇచ్చావని నిలదీయడంతో భార్యాభర్తల మధ్య వివాదం మొదలైంది. అప్పుగా తీసుకున్న డబ్బును త్వరగా తిరిగిచ్చేయాలని మంద కృష్ణపై విజయ్‌సింగ్‌ ఒత్తిడి పెంచాడు. డబ్బు తిరిగిచ్చే పరిస్థితి లేకపోవటంతో మందకృష్ణ అక్క మల్లీశ్వరితో కలిసి విజయ్‌సింగ్‌ను హత్య చేయాలని పన్నాగం పన్నాడు. తనను కూడా ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్నాడని మల్లీశ్వరి, చెల్లెలు తలారి పద్మ, తల్లి మంద లక్ష్మితో కలిసి పథకం వేశారు. ఆదివారం రాత్రి విజయ్‌సింగ్‌కు ఎక్కువగా మద్యం తాగించారు.

మత్తులోకి వెళ్లిన తర్వాత నలుగురూ కలిసి గొంతు నులిమి హత్య చేశారు. రాత్రి 12 గంటల తర్వాత హృతదేహాన్ని సైకిల్‌పై తీసుకెళ్లి ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌రోడ్డు సమీపంలోని ఓ ముళ్ల పొదలో పడేసి తగులబెట్టారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి విచారణ సాగించగా వారు నేరం అంగీకరించారు. ఈ మేరకు నలుగురినీ రిమాండ్‌కు తరలించారు. హత్య ఉదంతం వెలుగు చేసిన కొద్ది గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ భీంరెడ్డి అభినందించారు. విలేరుల సమావేశంలో సీఐ ప్రశాంత్, ఎస్‌ఐలు, పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు