మారని తీరు, భార్య చేతిలో భర్త ఖతం

5 Oct, 2020 08:34 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: నిత్యం తప్పతాగి వేధిస్తున్న భర్తను ఓ భార్య హతమార్చిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్య పల్లెలో జరిగింది. కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు కథనం ప్రకారం.. రాయికల్‌  మండల కేంద్రానికి చెందిన అలకుంట లక్ష్మయ్య (38)కు కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లెకు చెందిన కళావతికి 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మద్యానికి బానిసైన లక్ష్మయ్య రోజూ తాగి గొడవం చేయడం ఆనవాయితీగా మారింది. దీంతో కళావతిని ఆమె తల్లిదండ్రులు తిమ్మయ్యపల్లికి తీసుకొచ్చి తమ వద్దే ఉంచుకున్నారు. అయినా లక్ష్మయ్య తన తీరు మార్చుకోకుండా తిమ్మయ్యపల్లికి వచ్చి భార్యాబిడ్డలను వేధించేవాడు. ఇదే క్రమంలో శనివారం రాత్రి లక్ష్మయ్య తాగొచ్చి భార్య కళావతి, అత్త ఎల్లవ్వతో గొడవపడగా ఘర్షణలో ఎల్లవ్వ తలకు తీవరగాయమైంది. 

దాంతో రాత్రి ఎల్లవ్వ కోరుట్ల పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే గ్రామానికి వెళ్లేసరికి లక్ష్మయ్య తప్పతాగి పడిపోవడంతో గ్రామస్తులకు చెప్పి తిరిగొచ్చారు. గ్రామస్తులు లక్ష్మయ్యను పంచాయతీ భవనం వద్ద కట్టి ఉంచారు. కాగా, అర్ధరాత్రి తర్వాత కట్లు విప్పుకున్న లక్ష్మయ్య కత్తి తీసుకుని భార్య కళావతి, అత్త ఎల్లవ్వపై మరోసారి దాడికి ప్రయత్నించాడు. దాంతో గ్రామస్తులు మళ్లీ అతడిని తాళ్లతో కట్టేశారు. ఆ తరువాత కొద్దిసేపటికి లక్ష్మయ్య దగ్గరికి వెళ్లిన కళావతి కర్రతో అతడి తలపై బాది, కత్తితో గొంతులో పొడిచి చంపింది. లక్ష్మయ్యను తానే చంపేశానని ఆదివారం ఉదయం కళావతి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. కళావతిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు