కాలాంతకురాలు: భర్త హత్యకు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్‌.. కానీ..

2 May, 2022 15:53 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న రూరల్‌ సీఐ టీఎస్‌.మంగవేణి ( వెనుక ముసుగులో నిందితులు)

సాక్షి,విజయనగరం క్రైమ్‌: వివాహేతర సంబంధం విషయం భర్తకు తెలిసిపోయిందనే ఉద్దేశంతో ఎలాగైనా భర్తను కడతేర్చాలని ప్రియుడితో కలిసి ఆ కాలాంతకురాలు పథకం పన్నింది. పథకంలో భాగంగా మరో ఇద్దరి సాయం తీసుకుని, భర్త ఎముకలు విరగ్గొట్టించి, రైలు పట్టాలపై పడేసేలా చేసింది. అనుమానాస్పద మృతి కేసు నమోదుచేసిన  రైల్వే పోలీసులు, పోస్టుమార్టం అనంతరం రూరల్‌ పోలీసులకు బదలాయించారు. దీంతో విచారణ చేపట్టిన రూరల్‌ పోలీసులు అన్నికోణాల్లోనూ  దర్యాప్తు చేసి కట్టుకున్న భార్యే భర్తను కడతేర్చినట్లు నిర్ధారించి నలుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు. స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో  రూరల్‌ సీఐ టీఎస్‌.మంగవేణి ఆదివారం  వెల్లడించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.   

మిమ్స్‌ వైద్యకళాశాలలో  క్లర్క్‌గా పనిచేస్తున్న  అట్టాడ చంద్రశేఖర్‌ కుటుంబం నెల్లిమర్ల డైట్‌ కళాశాల సమీపంలో అద్దెకు ఉంటోంది.  గతంలో నెల్లిమర్ల పట్టణంలోని గొల్లవీధిలో కిలాని సూరి ఇంట్లో అద్దెకు  ఉండేవారు. ఆ సమయంలో సూరి రెండో కుమారుడు రాంబాబుతో  మృతుడు చంద్రశేఖర్‌ భార్య అరుణజ్యోతికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది.  ఈ విషయం చంద్రశేఖర్‌కు తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. దీంతో భర్తను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం పన్ని   అమలు చేసేందుకు ప్రియుడి స్నేహితుడు అదిలాబాద్‌ జిల్లాకు చెందిన, నెల్లిమర్లలో స్ధిరపడిన ఎర్రంశెట్టి సతీష్‌తో రూ.40 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. భర్తను చంపేందుకు డబ్బులు అవసరమని తల్లి సత్యవతిని మృతుడి భార్య జ్యోతి అడగ్గా తన వంతుగా రూ.20వేలు ఇచ్చింది.    

డైట్‌ కళాశాల శివారుకు తీసుకువెళ్లి.. 
చంద్రశేఖర్‌ను  గత నెల 24న రాత్రి  డైట్‌ కళాశాల శివారు ప్రాంతానికి  జ్యోతి ప్రియుడు రాంబాబు, ఎర్రంశెట్టి సతీష్‌లు తీసుకువెళ్లి మద్యం తాగారు. అనంతరం పథకం ప్రకారం ఐరన్‌ రాడ్లతో పక్కటెముకలు, తలపై బలంగా కొట్టి కత్తిపోట్లు పొడిచి,  ఎవరికీ అనుమానం రాకుండా రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని పడేసి, సమీపంలో మృతుడి ఐడీకార్డులు విసిరేసి పరారయ్యారు.  మరుసటిరోజు ఉదయం స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వెళ్లిన రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. పోస్టుమార్టం అనంతరం రూరల్‌ పోలీసులకు కేసు అప్పగించారు.  రూరల్‌ పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ చేయడంతో నిందితులు నేరం  అంగీకరించారు. దీంతో మృతుడి భార్య అరుణ జ్యోతి, ఆమె తల్లి సత్యవతి, ప్రియుడు రాంబాబు, ఎర్రంశెట్టి సతీష్‌లను  అదుపులోకి తీసుకున్నారు.  కేసులో క్రియాశీలక పాత్ర పోషించిన  నెల్లిమర్ల ఎస్సై  పి.నారాయణరావు, ఏఎస్సై ఎ.త్రినాథరావు, హెచ్‌సీలు వి.శ్యామ్‌బాబు, ఆర్‌.రామారావు, కానిస్టేబుల్‌ షేక్‌షఫీలను సీఐ మంగవేణి అభినందించారు.  

చదవండి: తల్లితో సహజీవనం.. ఏడాది కాలంగా కుమార్తెపై అత్యాచారం..

మరిన్ని వార్తలు