ఏమైందో తెలియదుగాని భార్య చేతిలో భర్త హతం

8 Jan, 2022 08:20 IST|Sakshi

వివాహ సమయంలో ఏడడుగులు నడిచి జీవితాంతం సుఖసంతోషాలతో ఉంటామని ఒక్కటైన భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. అవి కాస్త చినికిచినికి గాలివానయ్యాయి. వివాదం దిశ పోలీసుస్టేషన్‌ వరకూ వెళ్లింది. అక్కడ పోలీసులు ఇరువురికీ సర్దిచెప్పి సంసారం సాగించాలని సూచించారు. అంతా మారినట్టే కనిపించింది. ఇంతలోనే ఏమైందో తెలియదుగాని భార్యే భర్తను హతమార్చింది. వివరాల్లోకి వెళ్తే... 
డెంకాడ(విజయనగరం): విజయనగరం మండలం ధర్మపురి గ్రామానికి చెందిన గేదెల సూరిబాబు డెంకాడ మండలంలోని చింతలవలస ప్రాంతంలో గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి పోలీసులు, ఇతర వర్గాలు అందించిన వివరాలు... ధర్మపురం గ్రామానికి చెందిన గేదెల సూరిబాబు(40)కు డెంకాడ మండలం చింతలవలస గ్రామానికి చెందిన రామయ్యమ్మతో 13 సంవత్సరాల కిందట వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో వీరి కేసు దిశ పోలీసుస్టేషన్‌కు వెళ్లింది. భార్యాభర్తల వివాదం కావడంతో సర్ది చెప్పి చక్కగా కాపురం చేసుకోవాలని సూచించి పంపించారు.

ఈ క్రమంలో రామయ్యమ్మ కొంతకాలం కన్నవారి ఇంట, కొంతకాలం భర్త వద్ద ఉంటూ వస్తోంది. ఇలా వివాదాల నడుమే వీరి కాపురం సాగుతోంది. భార్య రామయ్యమ్మ ప్రస్తుతం కన్నవారి ఇంట చింతలవలసలో ఉంది. గురువారం రాత్రి రామయ్యమ్మను ధర్మపురికి రావాలని భర్త సూరిబాబు కోరడంతో వారి మధ్య మరోసారి వివాదం నెలకొందని పోలీసులు తెలిపారు. చివరకు సూరిబాబుతో కలిసి రామయ్యమ్మ గురువారం రాత్రి చింతలవలస నుంచి ధర్మపురికి బయలుదేరింది. మార్గమధ్యలో చింతలవలస శ్మశాన వాటిక రోడ్డు వద్దకు వచ్చేసరికి రామయ్యమ్మ తన అన్న సాయంతో సూరిబాబుపై కర్రలతో దాడి చేసి హతమార్చింది. 

దర్యాప్తు ముమ్మరం 
సూరిబాబును హత్య చేయడంలో భార్య రామయ్యమ్మతో పాటు ఇంకెవరు ఉన్నారన్న దానిపై లోతైన విచారణ పోలీసులు చేస్తున్నారు. సూరిబాబు హత్య కేసులో రామయ్యమ్మ పాత్ర నిర్ధారణ కాగా, అన్న పరిశినాయుడుతో పాటు ఇంకెవరు ఉన్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పద్మావతి తెలిపారు. రామయ్యమ్మను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. 

మృతదేహాన్ని పరిశీలించిన సీఐ  
హత్యకు గురైన గేదెల సూరిబాబు మృతదేహాన్ని భోగాపురం సీఐ కేకేవీ విజయ్‌నాథ్, డెంకాడ, భోగాపురం ఎస్‌ఐలు పద్మావతి, మహేష్‌ పరిశీలించారు. ఎస్‌ఐ పద్మావతి కేసు నమోదు చేయగా, సీఐ విజయ్‌నాథ్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు. దీంతో మరిన్ని విషయాలు వెలుగులోకి  రానున్నాయి.

మరిన్ని వార్తలు