భర్తను హతమార్చిన భార్య

30 Nov, 2020 08:28 IST|Sakshi
విలపిస్తున్న మృతుడి రెండో భార్య, కూతురు

రెండో భార్యకు ఆస్తి పోతుందని కక్ష

బంధువులతో కలిసి హత్య

ముస్తాబాద్‌(సిరిసిల్ల): పిల్లలు లేని తనకుకాకుండా.. రెండో భార్యకు ఆస్తి దక్కుతుందని భావించిన మొదటి భార్య బంధువులతో కలిసి భర్తను హతమార్చింది. సిరిసిల్ల టౌన్‌ సీఐ వెంకటనర్సయ్య, మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా..ముస్తాబాద్‌ మండలం సేవాలాల్‌తండాకు చెందిన ధరమ్‌సోత్‌ శంకర్‌నాయక్‌(49)పై అతడి మొదటి భార్య సరోజన, మరో ఇద్దరు బంధువులు కలిసి శనివారం రాత్రి దాడి చేశారు. తీవ్రగాయాలకు గురైన శంకర్‌నాయక్‌ను సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. శంకర్‌నాయక్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో ముస్తాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.

మృతిచెందిన శంకర్‌నాయక్

కాగా శంకర్‌నాయక్‌కు గతంలో సరోజనతో వివాహం జరిగింది. వీరికి సంతానం కలగలేదు. దీంతో సేవాలాల్‌ తండాకే చెందిన రాజవ్వను శంకర్‌నాయక్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు జన్మించింది. అయితే వ్యవసాయ భూమిని తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని శంకర్‌నాయక్‌పై మొదటి భార్య సరోజన కొంతకాలంగా ఒత్తిడి తెస్తోంది. ఇద్దరి మధ్య ఆస్తిపై గొడవలు జరుగుతున్నాయి. పిల్లలు లేని తనను ఎవరూ పట్టించుకోరని ఆస్తి రాసివ్వాలని పంచాయితీలు పెట్టింది.(చదవండి: పథకం ప్రకారమే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య)

అయితే అందుకు అతడు నిరాకరించడంతో తన బంధువులైన లక్ష్మీ, శ్రీనివాస్, సరోజన కలిసి శంకర్‌నాయక్‌కు శనివారం రాత్రి ఫుల్‌గా మందు తాగించారు. అనంతరం మద్యం మత్తులో ఉన్న శంకర్‌నాయక్‌పై ముగ్గురు కలిసి దాడి చేసి కొట్టారు. శంకర్‌ను చంపిన ముగ్గురిని శిక్షించాలని రెండో భార్య రాజవ్వ, ఆమె బంధువులు ముస్తాబాద్‌లో ఆందోళన చేపట్టారు. హత్యకు కారణమైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటనర్సయ్య, ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా