'నువ్వు చస్తే నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని అబార్షన్‌ చేయించుకుంటా'

26 Aug, 2022 18:54 IST|Sakshi
రాకేష్‌ (ఫైల్‌)

సాక్షి, హన్మకొండ: భార్య, అత్తింటివారి వేధింపులు తాళలేక సూసైడ్‌ నోట్‌ రాసి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజపల్లి గ్రామంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. రాజపల్లికి చెందిన కొండా రాకేశ్‌(28) హెచ్‌సీఎల్‌ కంపెనీలో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఫిబ్రవరి 2న ఎలుకుర్తి హవేలికి చెందిన దేవుళ్లపల్లి శంకర్‌ కుమార్తె నిహారికతో వివాహం జరిగింది.

కొన్ని రోజులు వీరి సంసారం సాఫీగానే సాగింది. రాకేశ్‌ ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోం చేస్తుండడంతో రాజపల్లిలోనే ఉంటున్నారు. పల్లెటూరులో ఉండడం ఇష్టంలేని నిహారిక హైదరాబాద్‌ వెళ్దామని రాకేశ్‌తో తరుచూ గొడవ పడేది. వర్క్‌ ఫ్రం హోం పూర్తికాగానే వెళ్దామని సర్ధి చెప్పినా వినకుండా గొడవపడేది. ఈ విషయమై పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా వినని నిహారిక రాకేశ్‌తో సంసారం చేయడం ఇష్టంలేదని, పుట్టింటికి వెళ్లి అబార్షన్‌ చేయించుకుంటానని భర్త, అత్తమామలతో గొడవపడి చీపురుతో కొట్టి వెళ్లిపోయింది.

చదవండి: (ప్రేమ వివాహం.. ఆపై కులం తక్కువని..)

ఈ క్రమంలో వీడియోకాల్‌ చేసి రాకేశ్‌ను దుర్భాషలాడుతూ నువ్వు చస్తే నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని అబార్షన్‌ చేయించుకుంటానని నిహారిక వేధించింది. ఇదే విషయమై ఆమె తల్లిదండ్రులు సైతం మానసికంగా వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాకేశ్‌ సూసైడ్‌ నోట్‌ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ములుగు ఫ్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకటరాజ్యం ఫిర్యాదు మేరకు రాకేశ్‌ భార్య నిహారిక, అత్తమామలు దేవుళ్లపల్లి శంకర్, అరుణపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  

చదవండి: (Doctor Death Mystery: ‘అశ్లీల చిత్రాలతో బెదిరించి చంపేశాడు’)

మరిన్ని వార్తలు