వివాహేతర సంబంధం: భర్తను హత్య చేసింది

19 Jan, 2021 10:03 IST|Sakshi
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌ రెడ్డి

సాక్షి, పంజగుట్ట: ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే చంపేసింది. సోమవారం పంజగుట్ట ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌ రెడ్డి వివరాలు వెల్లడించారు. బిహార్‌కు చెందిన లక్ష్మణ్‌ ఝా, ఖుష్బూ దంపతులు మక్తా, రాజ్‌నగర్‌లో నివాసముంటున్నారు. రాత్రి వేళ సెక్యూరిటీ గార్డుగా, పగలు జ్యూస్‌షాపు నడుపుతూ లక్ష్మణ్‌ జీవనం సాగిస్తున్నాడు. దీంతో న్యూరాలజీ సమస్య వచ్చింది. ఇతని జ్యూస్‌ సెంటర్‌ వద్ద లక్ష్మణ్‌ దూరపు బంధువు లాల్‌బాబు పనిచేస్తుంటాడు. లక్ష్మణ్‌కు మధ్యాహ్నం టిఫిన్‌ ఇచ్చేందుకు ఖుష్బుదేవి వస్తుండేది. ఈ సమయంలో వారి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. లాక్‌డౌన్‌ అనంతరం లాల్‌బాబు మరోచోట పనిచేయడం ప్రారంభించాడు. అయినా వీరి మధ్య బంధం కొనసాగింది.

దీంతో లక్ష్మణ్‌ను అడ్డుతొలగించుకోవాలని భావించారు. ఈ నెల 14న రాత్రి లక్ష్మణ్‌ పడుకున్నాక లాల్‌బాబు ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి లక్ష్మణ్‌ చేతులు కట్టేశారు. ఖుష్బుదేవి లక్ష్మణ్‌ ఛాతీపై కూర్చుని చున్నీ మెడకు బిగించి ఇద్దరూ కలిసి గట్టిగా నొక్కి చంపేశారు. ఉదయం లక్ష్మణ్‌ సోదరుడికి ఖుష్చుదేవి ఫోన్‌ చేసి నిద్రలోనే చనిపోయాడని చెప్పింది. మెడపై గాట్లు చూసి అతను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన పోలీసులు విషయం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు.  

  

మరిన్ని వార్తలు