భర్త వివాహేతర సంబంధాలు.. వేడినూనె పోసి చంపేందుకు భార్య...

7 Sep, 2022 07:45 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

జియాగూడ (హైదరాబాద్‌): వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడనే అనుమానంతో ఓ భార్య నిద్రిస్తున్న భర్తపై వేడినూనె పోసి హత్య చేసేందుకు యత్నించిన సంఘటన మంగళవారం కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శేఖర్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దరియాబాగ్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిధర్‌ (50) కూలీగా పని చేస్తున్నాడు. అతనికి భార్య రేణుక, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

విజయవాడకు చెందిన వీరు పిల్లల చదువుల నిమిత్తం నగరానికి వలస వచ్చి గుడిమల్కాపూర్‌ ప్రాంతంలో ఉండేవాడు. 10 రోజుల క్రితం అక్కడి నుంచి దరియాబాగ్‌ ప్రాంతానికి మకాం మార్చారు. గిరిధర్‌ ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నాడని రేణుక అతడితో గొడవ పడేది. మంగళవారం పనికి వెళ్లి వచ్చిన గిరిధర్‌ ఉదయం 11 గంటల ప్రాంతంలో నిద్రిస్తుండగా రేణుక కాగుతున్న మంచినూనెను అతనిపై పోసింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: (చిచ్చు రేపిని బిర్యాని వంట... భార్యపై కత్తితో దాడి)

మరిన్ని వార్తలు