వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. 

16 Nov, 2020 11:06 IST|Sakshi
హత్య కేసు వివరాలను వెల్లడిస్తున్న సీఐ సోమయ్య  

సాక్షి, ఆత్మకూరు: వ్యక్తి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి భార్యే కడతేర్చినట్లు దర్యాప్తులో తేల్చారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను ఆదివారం అరెస్ట్‌ చేసినట్లు ఆత్మకూరు సీఐ వైవీ సోమయ్య తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను సీఐ వెల్లడించారు. ఆత్మకూరు మండలం దేపూరు ఎస్సీ కాలనీకి చెందిన కటారి వెంకటేశ్వర్లు(37), వెంకట సుబ్బమ్మ దంపతులు. జీవాలను మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. వెంకట సుబ్బమ్మ తన సమీప బంధువైన కొలకాని పెంచలయ్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తుండగా భర్త పలుమార్లు మందలించాడు. అయినా భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. చదవండి : ప్రేయసి మోసం, ప్రణయ్‌ ఆత్మహత్య

ఈ నేపథ్యంలో ఏడాదిన్నర క్రితం వెంకటసుబ్బమ్మ, పెంచలయ్య గ్రామం విడిచి వెళ్లి ఆత్మకూరులో సహజీవనం సాగించారు. ఇటీవల విడిపోయి తిరిగి ఎవరిళ్లకు వారు చేరుకున్నారు. అయితే తిరిగి మళ్లీ వారిద్దరూ అక్రమ సంబంధం కొనసాగిస్తున్న విషయాన్ని వెంకటేశ్వర్లు గమనించి హెచ్చరించాడు. దీంతో తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య కడతేర్చేందుకు ప్రణాళిక వేసింది. ఈ నెల 9న వెంకటేశ్వర్లు జీవాలకు మేత కోసం పొలాల్లోకి వెళుతుండగా గమనించి ప్రియుడితో కలిసి తోట దారి వద్ద తలపై దాడి చేయడంతో  అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తరువాత ఎలాంటి అనుమానం రాకుండా నిందితులు గ్రామానికి చేరుకున్నారు. ఈ నెల 11న గ్రామస్తులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో నిజాలు వెలుగు చూడడంతో నిందితులను అరెస్ట్‌ చేసినట్లు సీఐ తెలిపారు.  ఈ సమావేశంలో ఆత్మకూరు ఎస్సైలు ఎం రవినాయక్, సీ సంతోష్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. చదవండి: భార్య దారుణ హత్య.. భర్త ఏమయ్యాడు..!

ఆడుకునేందుకు వెళ్లి.. విద్యుదాఘాతానికి బాలుడి బలి 
కోట: స్థానిక అరుంధతీయ కాలనీలో దీపావళి పండగ రోజు విషాదం చోటుచేసుకుంది. ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోవడం అందర్ని కలచి వేసింది. కోట ఇన్‌చార్జి ఎస్సై భోజ్యానాయక్‌ వివరాల మేరకు..అరుంధతీయ కాలనీకి చెందిన గోనిపాక కోటమ్మ కుమారుడు కిషోర్‌(11) తన స్నేహితులతో కలిసి కోటక్రాస్‌రోడ్డు వద్దకు ఆడుకునేందుకు వెళ్లాడు. అక్కడ హరిహర రైస్‌మిల్లు సమీపంలో ఎత్తుగా ఉన్న వడ్ల పొట్టు వద్ద ఆడుకుంటున్న సమయంలో 11కేవీ విద్యుత్‌వైర్లు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే బాలుడు విగతజీవిగా పడి ఉన్నాడు. బాలుడి తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించగా, తల్లి అల్లారుముద్దుగా పెంచుకుంటోంది.

విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందడంతో ఆమెను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఈ ఘటనతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుడి మృతదేహానికి పోలీసులు పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా బాలుడి బంధువులు ఆగ్రహంతో ప్రమాదానికి కారణమైన హరిహర రైస్‌మిల్లు వద్ద ఆదివారం మృతదేహంతో ధర్నాకు దిగారు. రైస్‌మిల్లు యాజమాన్యం 11కేవీ విద్యుత్‌ వైర్లు తగిలేంత వరకు వడ్ల పొట్టును పోయడం..పొట్టులో విద్యుత్‌వైర్లు కూరుకుపోయి కనిపించకుండా ఉండడంతో ప్రమాదం జరిగిందన్నారు. రైస్‌మిల్లు యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని పట్టుబట్టారు. దీంతో  ఇన్‌చార్జి ఎస్సై భోజ్యానాయక్‌ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు.   

మోటార్‌ వేస్తుండగా..
నెల్లూరు(క్రైమ్‌): విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన సప్తగిరిలేఅవుట్‌లో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు..సప్తగిరి లేఅవుట్‌లో పీ బాలంకిరెడ్డి (48), సుజాత దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నెల 14న ఉదయం సంపులోని వర్షపునీటిని తోడేందుకు బాలంకిరెడ్డి సెల్లార్‌లోని మోటార్‌ వేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బాలంకిరెడ్డి విద్యుదాఘాతానికి గురవగా కుటుంబ సభ్యులు హుటాహుటిన బొల్లినేని(కిమ్స్‌) ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు వేదాయపాళెం ఎస్సై ఎం పుల్లారెడ్డి కేసు దర్యాప్తు చేçస్తున్నారు.   

సముద్రంలో మునిగి యువకుడి మృతి   
ఇందుకూరుపేట: సముద్రంలో మునిగి బెంగళూరుకు చెందిన యువకుడు మృతి చెందిన ఘటన మైపాడు బీచ్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన రిషిశెట్టి తన కుటుంబ సభ్యులు ఆరుగురితో కలిసి కారులో తీర్థయాత్రలకు బయలుదేరారు. నెల్లూరు జిల్లాలోని పలు ఆలయాలను దర్శించుకున్న వీరు సేదతీరేందుకు మైపాడు బీచ్‌కు ఆదివారం చేరుకున్నారు. అందరూ కలిసి సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో రిషిశెట్టి పెద్దకుమారుడు కిరణ్‌ ఆర్‌ శెట్టి(21)కు ఈత వచ్చి ఉండడంతో సముద్రంలో కొద్దిగా లోపలకు వెళ్లాడు. సముద్రం కసురు మీద ఉండడంతో అలల తాకిడికి నీటి మునిగి గల్లంతయ్యారు. కొద్దిసేపటి తరువాత విగతజీవిగా ఒడ్డుకు కొట్టుకురావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇందుకూరుపేట ఎస్సై నరేష్‌ ఘటనా స్థలానికి  చేరుకుని వివరాలు ఆరాతీశారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు తరలించారు.     

మరిన్ని వార్తలు