ఆస్తి కోసమే నా భర్తను చంపేశారు

6 May, 2022 08:15 IST|Sakshi

అనంతపురం క్రైం: చనిపోయిన ఓ ఆటోడ్రైవర్‌ మృతదేహానికి 15 రోజుల తర్వాత పోస్టుమార్టం నిర్వహించాలని త్రీటౌన్‌ పోలీసులు నిర్ణయించారు. త్రీటౌన్‌ సీఐ హరినాథ్‌ వివరాల మేరకు ... స్థానిక ఇందిరానగర్‌కు చెందిన మహబూబ్‌పీరా (46) ఆటోడ్రైవర్‌గా విధులు నిర్వర్తించేవాడు. అతనికి భార్య ఆశా, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మహబూబ్‌పీరా పదేళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ అతని చెల్లెళ్ల వద్ద ఉంటున్నాడు. గత నెల 22న మహబూబ్‌పీరా వాంతి కాగా, ఈనో ప్యాకెట్‌ తెచ్చుకుని సేవించాడు. కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో కుటుంబీకులు జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహాన్ని ఇందిరానగర్‌ సమీపంలోని ముస్లిం శ్మశాన వాటికలో ఖననం చేశారు.

భర్త మృతిపై ఆమె భార్య ఆశా అనుమానం వ్యక్తం చేసింది. తన భర్త వద్ద రూ.30 లక్షల నగదు, ఆటోలు, ఇతర ఆస్తులు ఉన్నాయని వాటి కోసమే భర్తింటి వారు ఆయన్ను చంపేశారని ఇటీవల త్రీటౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే మహబూబ్‌పీరా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని ప్రభుత్వ వైద్య కళాశాల ఫోరెన్సిక్‌ విభాగానికి త్రీటౌన్‌ పోలీసులు లిఖిత పూర్వకంగా విన్నవించారు. రెండ్రోజుల్లో మహబూబ్‌పీరా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. 

(చదవండి: న్యూడ్‌ ఫొటోలు పంపుతామని బెదిరించారు.. తెల్లారి అన్నంత పనీ చేసేశారు)

మరిన్ని వార్తలు