దారుణం: భార్య చేతిలో భర్త హతం 

5 Jun, 2021 11:13 IST|Sakshi
కిరణ్‌కుమార్‌ మృతదేహం వద్ద విలపిస్తున్న భార్య తులసి- కిరణ్‌కుమార్, తులసి, కుమారులు  జీవన్‌ ఆచారి, సుశాంత్‌(ఫైల్‌)

ప్రవర్తన మార్చుకోవాలని నిలదీసిన భర్త పట్ల ఘాతుకం

తల్లిదండ్రులకు దూరమైన ఇద్దరు పిల్లలు  

కడప అర్బన్‌(వైఎస్సార్‌ జిల్లా): జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భార్యాభర్తలు ఒకరిపై, మరొకరు మనస్పర్థలు కలిగి ఘర్షణ పడ్డారు. చివరకు భార్య తులసి చేతిలోని కత్తికి భర్త వల్లూరు కిరణ్‌కుమార్‌ (35) బలయ్యాడు. భార్య కత్తితో దాడి చేయడంతో కిరణ్‌ మర్మాంగాలకు తీవ్రగాయమవడంతో రక్తపు మడుగులో పడిపోయాడు. స్థానికులు గమనించి 108కు ఫోన్‌ చేశారు. కొనఊపిరితో కొట్టుమిట్డాడుతూ ప్రాణాలను కోల్పోయాడు. ఈనెల 3వ తేదీ రాత్రి కడప నగరంలోని రియాజ్‌ హాల్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని తల్లి వల్లూరు నారాయణమ్మ ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి.

కడప నగరంలోని అక్కాయపల్లె శాస్త్రి నగర్‌కు చెందిన సుబ్బరాయుడు, నారాయణమ్మల రెండో కుమారుడు కిరణ్‌కుమార్‌కు, కలసపాడు మండలం, ముదిరెడ్డిపల్లెకు చెందిన పాలోజి సుబ్రమణ్యం కుమార్తె తులిసి(28)కి 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి జీవన్‌ఆచారి(10), సుశాంత్‌(8) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఏడాది నుంచి మనస్పర్థలు ఏర్పడ్డాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ చేశారు.ఇటీవల బిల్టప్‌ సమీపంలో పరమేశ్వర స్కూల్‌ వద్ద మూన్‌స్టార్‌ అనే బ్యూటీపార్లర్‌లో తులసి పనిచేస్తోంది. రియాజ్‌ హాల్‌ సమీపంలో ఇంటిలో నాలుగునెలల క్రితం చేరారు. కిరణ్‌కుమార్‌ కార్పెంటర్‌ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కాలంలో మళ్లీ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చెలరేగాయి. ఈక్రమంలో నాలుగురోజులుగా తులసిని, ప్రవర్తన సరిగా లేదని, మార్చుకోవాలని కిరణ్‌కుమార్‌ గొడవపడేవాడు.

ఈనెల 3వ తేదీ రాత్రి ఇద్దరి మధ్య గొడవ పెద్దదిగా మారింది. కిరణ్‌కుమార్‌ తన భార్యను జుట్టుపట్టుకుని, ముందుకు లాగి కొడుతుండగా, భార్య తులసి తన చేతిలోని కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో భర్త మర్మాంగాల వద్ద తీవ్రగాయమవడంతో రక్తపుమడుగులో పడిపోయాడు. ఈ సంఘటనపై సమాచారాన్ని బ్యూటీపార్లర్‌ యజమాని ఆస్మ, మృతుని తల్లి నారాయణమ్మకు ఫోన్‌ చేసి తెలియజేశారు. సంఘటనస్థలానికి చేరుకున్న నారాయణమ్మ, కుటుంబసభ్యులు కిరణ్‌కుమార్‌ రక్తపుమడుగులో విగతజీవుడిగా మారిపోయి ఉండటాన్ని గమనించి, తీవ్రంగా విలపించారు. తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన వల్ల తల్లిదండ్రులు దూరమైన కుమారులు జీవన్‌ ఆచారి, సుశాంత్‌లు పోలీసులకు, బంధువులకు సంఘటన జరిగిన విషయాన్ని తెలియజేశారు. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో తల్లి చేతి కత్తికి తండ్రి బలయ్యాడని తెలిపారు.

సంఘటన స్థలాన్ని పరిశీలించిన కడప డీఎస్పీ  
హత్య జరిగిన ప్రదేశాన్ని, మృతదేహాన్ని కడప డీఎస్పీ బూడిద సునీల్, కడప తాలూకా సీఐ ఎం. నాగభూషణం, ఎస్‌ఐ ఎస్‌కెఎం హుసేన్‌లు, తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలియజేశారు. ఈ సంఘటనలో నిందితురాలైన తులసిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.

చదవండి: కుటుంబాన్ని మింగేసిన అప్పుల బాధలు   
భార్యను చంపి.. ఆపై భర్త ఆత్మహత్య

    

మరిన్ని వార్తలు