ఫేస్‌బుక్‌ ప్రియుడి కోసం బిడ్డ ప్రాణం బలి.. తీరా అతని కోసం వెతికితే..

4 Jul, 2021 16:25 IST|Sakshi

తిరువనంతపురం: ప్రాంక్ సరదా మూడు నిండు ప్రాణాలను బలిగొంది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి కోసం ఓ బాలింత తన పసి బిడ్డను పొదల్లో వదిలి వెళ్లిపోయిన అమానుష సంఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాలు.. కొల్లాం జిల్లాలోని కల్లవుతుక్కల్ గ్రామానికి చెందిన రేష్మా అనే వివాహితకు ఫేస్‌బుక్‌లో ఆనంద్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త  ప్రేమగా  మారింది. కానీ ఎప్పడూ కలుసుకోలేదు.

అయితే, అప్పటికే  రేష్మా ఒక పండంటి మగ బిడ్డ జన్మనిచ్చింది. మరోవైపు ఫేస్‌బుక్‌ ప్రియుడు.. ఏదేమైనా ఇంట్లో నుంచి రావాలని. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో అతని మాటలు నమ్మిన రేష్మా తన బిడ్డను అడ్డు తొలగించుకుని ఆనంద్‌ తో వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది. పసి బిడ్డను దగ్గరలో గల రబ్బరు తోటల్లో వదిలి వెళ్లిపోయింది. తరువాత పసిబిడ్డను స్థానికులు గమనించి  ఆస్పత్రి కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ శిశువు మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా విస్మయకర విషయాలు వెలుగు చూశాయి.

అసలు ట్విస్ట్ ఏంటంటే
ఫేస్‌బుక్‌ ప్రియుడు ఆనంద్‌ జాడ లేకపోవడంతో రేష్మా తిరిగి ఇంటికి వచ్చింది. అదే సమయంలో పసికందు మృతి కేసులో పోలీసులు విచారణ చేపట్టి ఆమెను అరెస్ట్‌ చేశారు. ఆమె ఫేస్‌బుక్‌  స్నేహితుడు ఆనంద్‌ కోసం వెతకడం మొదలు పెట్టారు. అయితే, ఆనంద్‌ అనే వ్యక్తి లేనే లేడని పోలీసుల విచారణలో తేలింది. ఫేక్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా ఆనంద్‌ అనే పేరుతో ఎవరో చాటింగ్‌ చేసినట్టు వెల్లడైంది.

ఆర్యా, గ్రీష్మా ఆత్మహత్య
శిశువు మృతి కేసు విచారణ కొనసాగుతుండగానే రేష్మా బంధువులు ఆర్య, గ్రీష్మా దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిమ్‌ కార్డు వివరాల ఆధారంగా రేష్మాతో ఫేస్‌బుక్‌ చాటింగ్‌ చేసింది ఆమె బంధువులు ఆర్య, గ్రీష్మా అని వెల్లడైంది. రేష్మాతో ‘ప్రాంక్‌’ చేద్దామని ఆ ఇద్దరూ ఆనంద్‌ అనే ఫేక్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌తో కథంతా నడిపించారని ఆర్య, గ్రీష్మా స్నేహితుడొకరు పోలీసులకు చెప్పడంతో అసలు నిజం బయటపడింది. ‘ప్రాంక్‌’ పేరిట పసి ప్రాణం పోవడానికి కారకులం అయ్యామనే తీవ్ర మనోవేదనకు వారిద్దరూ బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

దుబాయ్‌ వచ్చిన విష్ణు
ఇక ఈ కథ మొత్తం దుబాయ్‌లో ఉంటున్న రేష్మా భర్తకు తెలియకపోవడం గమనార్హం. భార్య ప్రెగ్రెంట్‌గా ఉన్నప్పుడు దుబాయ్‌ వెళ్లిన విష్ణు ఆమెను జూన్‌లో అరెస్టు చేసినప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చాడు. తన బిడ్డ చనిపోవడం, ఆ కారణంగా మరో ఇద్దరు బంధువులు ప్రాణాలు తీసుకోవడం తెలుసుకున్న విష్ణు నిశ్ఛేష్టుడయ్యాడు. మరోవైపు తమ భార్యలు ఏ కారణంతో నదిలో దూకి చనిపోయారో తెలియని ఆర్యా, గ్రీష్మా భర్తలు నిజం బయటపెట్టినందుకు పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు. 

మరిన్ని వార్తలు