సీన్‌ రివర్స్‌, అయినా కూడా కోవిడ్‌ టీకా డ్రామా, ఆపై

15 Feb, 2021 12:02 IST|Sakshi
నిందితురాలు అనూష

మీర్‌పేట: కోవిడ్‌ టీకా పేరిట ఓ యువతి వృద్ధ దంపతులకు మత్తుమందు ఇచ్చి 8 తులాల బంగారు ఆభరణాలను అపహరించి కొత్తరకం మోసానికి పాల్పడిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... జిల్లెలగూడ లలితానగర్‌ రోడ్‌ నం.1కు చెందిన కుంతాల లక్ష్మణ్‌ (80), కస్తూరి (70) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

పెద్ద కుమారుడు బెంగళూరులో, చిన్న కుమారుడు దుబాయ్‌లో స్థిరపడడంతో ఇద్దరే ఒంటరిగా ఉంటున్నారు. లక్ష్మణ్‌ విద్యుత్‌ శాఖలో అకౌంటెంట్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. వికారాబాద్‌కు చెందిన విజయ్, అనూష (21)లు లక్ష్మణ్‌ పక్కింట్లో అద్దెకు ఉంటున్నారు. విజయ్‌ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా అనూష మందమల్లమ్మ సమీపంలోని విశ్వాస్‌ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసి మానేసింది. ప్రస్తుతం బీఎస్సీ నర్సింగ్‌ 4వ సంవత్సరం చదువుతోంది.

ఈ క్రమంలో వృద్ధ దంపతులతో ఆప్యాయతగా మాటలు కలిపి పరిచయం పెంచుకోవడంతో వారు అనూషపై నమ్మకం పెంచుకున్నారు. మూడు నెలల క్రితం అనూష ఇంటిని ఖాళీ చేసి అదే కాలనీలోని మరో ఇంట్లో అద్దెకు దిగారు. పాత పరిచయంతో కస్తూరి ఒంటిపై ఉన్న ఆభరణాలపై కన్నేసిన అనూష పథకం ప్రకారం శుక్రవారం వృద్ధ దంపతుల వద్దకు వచ్చి తాను గర్భవతినని, ప్రస్తుతం 8వ నెలని, తల్లిగారింటికి వెళ్తున్నానని ఆప్యాయతగా మాట్లాడి మత్తు మందు కలిపిన పాయసం ఇవ్వగా వారు తినలేదు.

సీన్‌ రివర్స్‌ కావడంతో మరుసటి రోజు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు అనూష మరలా వచ్చి తాను ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్నానని, కోవిడ్‌–19టీకా వేస్తానని మరో డ్రామాకు తెరలేపగా వృద్ధ దంపతులు దీనికీ నిరాకరించారు. బలవంతంగా వారికి ‘మిడోజాలం’అనే మత్తు మందును కోవిడ్‌–19టీకాగా నమ్మించి వేయగా వారు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే కస్తూరి ఒంటిపై ఉన్న బంగారు గాజులు, చెవి కమ్మ లు, మాటీలు, రెండు ఉంగరాలు, పుస్తెలతాడును తీసుకుని అక్కడినుంచి జారుకుంది.

దాదాపు రెండున్నర గంటల తరువాత తేరుకున్న లక్ష్మణ్‌ బంగా రు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్రైం ఎస్‌ఐ మారయ్య చాకచక్యంగా వ్యవహరించి స్థానికులు, సీసీపుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టి రెండు గంటల్లో అనూషను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుంచి బంగారాన్ని స్వాధీ నం చేసుకున్నారు. అనూషపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని సీఐ మహేందర్‌రెడ్డి తెలిపారు. 
చదవండి: ఎస్సారెస్పీ కాలువలోకి కారు.. ముగ్గురు మృతి
చదవండి: పులి విహారం.. టూరిస్టు గైడ్‌లుగా మహిళలు

మరిన్ని వార్తలు