బలవంతపు అబార్షన్‌: న్యాయవాది ఆత్మహత్యాయత్నం

6 Oct, 2020 14:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అత్యాచారం కేసులో తనకు అన్యాయం జరిగిందంటూ ఓ మహిళా న్యాయవాది(38) హైకోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. మురళి అనే వ్యక్తి తనను మోసం చేశాడంటూ గతంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా తనకు బలవంతంగా అబార్షన్‌ చేయించిన కుటుంబ సభ్యులపై కూడా కేసు పెట్టారు. అయితే తన విషయంలో పోలీసులు సరిగా స్పందించలేదని భావించిన ఆమె.. కోర్టును ఆశ్రయించగా నిందితులకు బెయిల్‌ వచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. తన పట్ల అనుచితంగా వ్యవహరించి వారందరిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ నోట్‌ రాసి ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. (చదవండి: ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడి.. మృతి)

బాధితురాలు పేర్కొన్న వివరాల మేరకు.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన బాధితురాలిని మురళి అనే వ్యక్తితో పరిచయమైంది. ఈ క్రమంలో అతడు సదరు మహిళపై అత్యాచారం చేశాడు. మెసపోయానని గుర్తించిన బాధితురాలు అతడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే ఆమె గర్భవతి కావడంతో కుటుంబ సభ్యులు అబార్షన్‌ చేయించారు. వేరొకరి పేరిట ఆస్పత్రిలో వివరాలు నమోదు చేయించి ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతంగా గర్భవిచ్చిత్తి చేయించారు. ఈ క్రమంలో తన తమ్ముడు సహా ఐదుగురు వ్యక్తులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మళ్లీ కోర్టును ఆశ్రయించి పిటిషన్‌ దాఖలు చేశారు. 

తనకు అన్యాయం చేసిన వాళ్లను కఠినంగా శిక్షించాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే కోర్టు ఆమె అభ్యర్థనను తోసిపుచ్చి.. నిందితులకు బెయిలు మంజూరు చేసింది. దీంతో ఆవేదనకు గురైన సదరు న్యాయవాది బలవంతంగా ప్రాణాలు తీసుకునేందుకు యత్నించారు. తన జీవితం నాశనమైందని, ఇలాంటి దుస్థితి ఏ అమ్మాయికి రాకూడదంటూ పోలీసులు, కుటుంబ సభ్యుల తీరును తప్పుబట్టారు. తోటి న్యాయవాదులు సైతం తనను ఇబ్బందులకు గురిచేసేలా మాట్లాడారని లేఖలో రాసుకొచ్చారు. తాను సమర్పించిన ఒరిజినల్‌ సాక్ష్యాధారాలను మాయం చేసి తననో పిచ్చిదానిలా ముద్ర వేసేందుకు ప్రయత్నించారని మనస్తాపం చెందారు.

మరిన్ని వార్తలు