విషం తాగించి, హత్యాయత్నం చేశారు.. నా భర్తతో ప్రాణహాని ఉంది.. రక్షించండి 

24 Jan, 2022 10:06 IST|Sakshi

సాక్షి, సైదాబాద్‌: ప్రభుత్వ అధికారి అయిన తన భర్త నుంచి ప్రాణహాని ఉందని పోలీసులు తనను రక్షించి అతనిపై చర్యలు తీసుకోవాలని ఓ మహిళ వాపోయింది. ఐఎస్‌సదన్‌ డివిజన్‌ సరస్వతీనగర్‌ కాలనీకి చెందిన బాధితురాలు ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించింది. నాగార్జునసాగర్‌లో ఎస్‌ఈగా పనిచేస్తున్న కొర్ర ధర్మపై గతంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించి పలు ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న బాధితురాలి పేరుతో ఉన్న ఆస్తులను తన పేరుపై రాసివ్వాలని భర్త ధర్మ వేధింపులకు దిగాడని ఆమె పేర్కొంది.

తనను ఇంటి నుండి బయటకు వెళ్లనీయకుండా ఒకగదిలో బంధించాడని ఆరోపించింది. ఈనెల 4న అతను, సహచరులతో కలిసి బలవంతంగా  విషం తాగించి తనపై హత్యాయత్నం చేశారన్నారు. ఆసుపత్రిలో నాలుగు సర్జరీలతో తేరుకున్నానని వివరించారు. ఇంటి నుండి ఎలాగోలా బయట పడ్డానని, ఆస్తులన్నీ అతని పేరుతో బదలాయిస్తానని, కానీ తనకు అతని నుండి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. పోలీసు ఉన్నతాధికారులు రక్షణ కల్పించాలని ఆమె కోరారు. 

భార్య మిస్సింగ్‌ అంటూ భర్త ఫిర్యాదు 
ప్రభుత్వ అధికారి అయిన భర్తపై ఆరోపణలు చేసిన సదరు మహిళ కనపడటంలేదని  ఆమె భర్త సైదాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసారు. సైదాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ సబ్బిరామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...నాగార్జునసాగర్‌లో ప్రభుత్వ ఉద్యోగి అయిన ధర్మ తన భార్య పద్మజకు కుటుంబ పరిస్థితుల కారణంగా మానసికస్థితి సరిగాలేదని ఆమె శనివారం మధ్యాహ్నం నుండి కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. శనివారం రాత్రి సైదాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  
చదవండి: హైదరాబాద్‌: ఇద్దరు పిల్లలతో కలిసి గృహిణి అదృశ్యం 

మరిన్ని వార్తలు