మాయలేడి: సోషల్‌ మీడియాలో యువకులకు వల.. నమ్మించి జేబు ఖాళీ

18 Dec, 2022 11:19 IST|Sakshi

సోషల్‌ మీడియాలో యువకులకు వల 

పెళ్లి చేసుకుందామని నమ్మించి మోసం 

రూ.31 లక్షలు మోసపోయిన బాధితుడు 

రాచకొండ సైబర్‌ క్రైమ్‌లో కేసు నమోదు 

యువతితో పాటు మరొకరి అరెస్టు

సాక్షి, హైదరాబాద్‌: మత్తెక్కించే మాటలతో ఆకట్టుకుంటుంది. చూపు తిప్పుకోలేని అందమైన ఫొటోలు, వీడియోలతో ఆకర్షిస్తుంది. పెళ్లి చేసుకుందామని నమ్మించి జేబు ఖాళీ చేసేస్తుంది ఈ మాయలేడి! సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరిచి యువకులకు గాలం వేస్తున్న యువతితో పాటు ఆమెతో సహజీవనం చేస్తున్న మరొకరిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ బీ రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 

ప్రకాశం జిల్లా, గిద్దలూరుకు చెందిన పరాస తనుశ్రీ, పరాస రవితేజ ఇద్దరు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని భావించిన ఇరువురూ పథకం వేశారు. సోషల్‌ మీడియాలో నకిలీ ఖాతా తెరిచి యువకులను ఆకర్షించాలని నిర్ణయించుకున్నారు. తనుశ్రీ పేరుతో ఇన్‌స్ట్రాగామ్‌లో నాలుగు అకౌంట్లు తెరిచి అందమైన ఫొటోలు, వీడియోలను పోస్ట్‌ చేసేది. దీంతో తక్కువ సమయంలోనే ఆమెకు ఫాలోవర్స్‌ సంఖ్య పెరిగింది. కామెంట్లు పెట్టేవారిలో బ్యాచిలర్స్, అమాయకులను ఎంపిక చేసుకుని వారికి రిప్‌లై ఇచ్చేది. ఫోన్‌ నంబర్లు తీసుకుని తియ్యని మాటలతో ప్రేమగా మాట్లాడుతూ నమ్మించేది. 

ఈ క్రమంలో ఓ రోజు ఫిర్యాదుదారుడికి తనుశ్రీ ఇన్‌స్ట్రాగామ్‌ నుంచి మెసేజ్‌ వచ్చింది. తక్కువ సమయంలో ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఒకరికొకరు ఫోన్‌ నంబర్లు మార్చుకొని గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. తల్లికి ఆరోగ్యం బాలేదని, గృహ రుణం వాయిదా చెల్లించాలని, కరోనా వచ్చిందని ఇలా రకరకాల సాకులతో ఖర్చులకు డబ్బులు కావాలని అడగడంతో 8 నెలల కాలంలో రూ.31.66 లక్షలు బదిలీ చేశాడు.  

ఒక రోజు యువతి బాధితుడితో పెళ్లి చేసుకుందామని చెప్పింది. నిజమేనని నమ్మిన బాధితుడు ఎదురుచూశాడు. ఆపై ఆమె నుంచి రిప్‌లై రాకపోవటంతో మోసపోయానని గుర్తించి రాచకొండ సైబర్‌ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాంకేతికత ఆధారాల ఆధారంగా తనుశ్రీ, రవితేజలను అరెస్టు చేసి, జ్యూడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వీరు ఇద్దరూ పలువురు యువకులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే వీరిపై మేడిపల్లి ఠాణాలోనూ కేసు నమోదయింది.

ఇదీ చదవండి: Anti Hijab Protests: ఆస్కార్‌ విన్నింగ్‌ మూవీ నటి అరెస్ట్‌

మరిన్ని వార్తలు