ఐదేళ్ల క్రితం ప్రియుడితో కలిసి భర్త హత్య.. తల్లికి అనుమానం రావడంతో

20 Jul, 2021 08:31 IST|Sakshi
పోలీసులు అరెస్ట్‌ చేసిన నిందితులు

సాక్షి, భీమారం(ఆదిలాబాద్‌): ఐదేళ్ల క్రితం జిల్లాలోని భీమారం మండలం పోలంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన పాస్టర్‌ సత్యరాజ్‌ కేసును కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు. విచారణ అనంతరం పాస్టర్‌ భార్య మహేశ్వరి, మరో నలుగురిని సోమవారం అరెస్ట్‌ చేసి రోడ్డు ప్రమాదం కేసును హత్య కేసుగా మార్చారు. నిందితుల్లో మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి భీమారం పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. 

కోడలు ప్రవర్తనలో మార్పుతో అనుమానం..
సెప్టెంబర్‌ 20, 2016న భీమారం మండలం దాంపూర్‌లోని సత్యరాజ్‌ రాత్రివేళ స్కూటీపై వెళ్తుండగా పథకం ప్రకారం కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఎలాంటి అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ఐదేళ్ల తరువాత కోడలి ప్రవర్తనలో మార్పు కనిపించడంతో సత్యరాజ్‌ తల్లి లక్ష్మికి అనుమానం మొదలైంది. తన కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, హత్య చేసి చంపారని ఆరునెలల క్రితం భీమారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భీమారం పోలీసులు విచారణ జరిపిన అనంతరం సత్యరాజ్‌ భార్య మహేశ్వరితోపాటు ఆమె సోదరుడు శ్రీకాంత్, ప్రియుడు గంగాధర్, మరోవ్యక్తి మల్లారెడ్డిని అరెస్ట్‌ చేశారు. 

అసలు ఏం జరిగిందంటే..?
శ్రీరాంపూర్‌ కాలనీ సమీపంలోని అరుణక్క నగర్‌ వద్ద గల చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న కన్నూరి సత్యరాజ్‌(32)తో లక్సెట్టిపేట చర్చి ఫాదర్‌ కాముని గంగాధర్‌కు పరిచయం ఏర్పడింది. తరచూ సత్యరాజ్‌ ఇంటికి గంగాధర్‌ వెళ్లేవాడు. సత్యరాజ్‌ భార్య మహేశ్వరితో గంగాధర్‌కి వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలిసిన సత్యరాజ్‌ ప్రవర్తన మార్చుకోవాలని మహేశ్వరికి సూచించారు. గంగాధర్‌తో కూడా గొడవపడ్డాడు.

తమ సంబంధానికి సత్యరాజ్‌ అడ్డుగా ఉన్నాడని భావించిన మహేశ్వరి, గంగాధర్‌లు అతన్ని హత్య చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గంగాధర్‌ వద్ద ఉన్న టవేరా వాహనంతో ఢీకొట్టి హత్య చేయాలని పథకం రచించారు. గంగాధర్‌ పేరుతో రిజిస్టర్‌ ఆయిన వాహనం వాడితే పోలీసులకు విచారణలో తెలుస్తుందని గంగాధర్‌ స్నేహితుడు రమేశ్‌రెడ్డి సూచించగా కరీంనగర్‌ జిల్లా గొల్లపల్లికి చెందిన బోనగిరి మల్లారెడ్డికి అమ్మినట్లు అగ్రిమెంట్‌ చేసుకున్నారు.

ప్రణాళిక ప్రకారం దాంపూర్‌కి స్కూటీపై సత్యరాజ్‌ని పంపి వెనుకాలే వెళ్లి ఢీ కొట్టారు. గాయాలపాలైన సత్యరాజ్‌ ఆసుపత్రిలో చి కిత్స పొందుతూ మరణించాడు. ఎవరికి అనుమానం రాకుండా మహేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. టవేరా కొనుగోలు చేసిన బోనగిరి మల్లారెడ్డికి రూ.50 వేలు ఇచ్చి పోలీసుల వద్ద సరెండర్‌ చేశారు. రోడ్డు ప్రమాదంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సత్యరాజ్‌ తల్లికి వచ్చిన అనుమానంతో ఆరునెలల క్రితం తిరిగి విచారణ జరుపగా హత్యగా తేలింది.

హత్య కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు డీసీపీ తెలిపారు. శ్రీరాంపూర్‌ సీఐ సంజీవ్, ఎస్సై ఆశోక్‌ పరిశోధన జరిపి కేసుని ఛేదించారని తెలిపారు. నలుగురు అరెస్ట్‌ కాగా జగిత్యాలకు చెందిన రమేశ్‌రెడ్డి పరారీలో ఉన్నారన్నారు. హత్యకు ఉపయోగించిన టవేరా వాహనంతోపాటు అగ్రిమెంట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో జైపూర్‌ ఏసీపీ నరేందర్, శ్రీరాంపూర్‌ సీఐ సంజీవ్, ఎస్సై అశోక్‌ పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు