-

6 ఏళ్లుగా వివాహేతర సంబంధం.. పక్కా స్కెచ్‌.. ప్రియునితో కలిసి...

29 Jun, 2021 10:32 IST|Sakshi

సాక్షి, ఖానాపురం(వరంగల్‌): రెండు నెలల క్రితం అదృశ్యమైన ట్రాక్టర్‌ డ్రైవర్‌ హత్య మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేయించిన సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపురం మండలంలోని బుధరావుపేట పరిధిలో గల బోడియాతండాలో చోటుచేసుకుంది.ఎస్సై నండృ సాయిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. బోడియాతండాకు చెందిన కున్‌సోతు రవి(35) బుధరావుపేట గ్రామానికి చెందిన దావూద్‌ వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

ఇదే క్రమంలో దావూద్‌కు రవి భార్య భారతితో ఆరు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. డ్రైవర్‌గా పని చేస్తున్న క్రమంలో దావూద్‌ రవి ఇంటికి వెళ్లి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉండేవాడు. ఆరు నెలల క్రితం రవి దావూద్‌ వద్ద డ్రైవర్‌ పని మానేశాడు. గతంలో అక్రమ సంబంధం కొనసాగించడానికి నిరంతరం భారతి ఇంటికి వెళ్లగా ఎలాంటి అనుమానం రాలేదు. డ్రైవర్‌గా మానేయడంతో దావూద్‌ భారతి ఇంటికి వెళ్లే క్రమంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

దీంతో రవిని ఎలాగైనా అడ్డు తొలగించుకుంటేనే అక్రమ సంబంధం కొనసాగుతుందని ఇరువురు భావించి హత్యకు పథకం ఎంచుకున్నారు. ఏప్రిల్‌ 23న రవితో ఫుల్‌బాటిల్‌ మందు తెప్పించుకుని బుధరావుపేట గ్రామ శివారులోకి వెళ్లి మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న రవిని కర్రతో దావూద్‌ బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని సమీపంలో ఉన్న బావి వద్దకు తీసుకెళ్లి బావిలో పడేసి భారతికి విషయం తెలియజేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజున అనుమానంతో బావి వద్దకు వెళ్లిన దావూద్‌కు మృతదేహం నీటిపై తేలియాడటాన్ని గమనించి రెండు బండరాళ్లను కట్టి బావిలోకి వదలడంతో నీటిలో మునిగిపోయింది.

రెండు నెలల నుంచి ఇరువురు తమకేమీ తెలియనట్లుగానే ఎవరి పనులు వారు సాగించుకుంటున్నారు. రెండు నెలల నుంచి కొడుకు ఇంటికి రాకపోవడంతో తల్లి ఈరమ్మ ఈనెల 23న ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టగా రవి హత్య విషయం బయటపడింది. మృతుడికి ఇరువురు కుమారులు ఉండగా సంంఘటన స్థలం వద్దే ఖననం చేసే క్రమంలో కుమారులు రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. చిన్నారులు ఇరువురు అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటామని తెలపడంతో అక్కడికే పంపారు. దీంతో దావూద్, భారతిలను నర్సంపేట ఏసీపీ ఫణీందర్, ఏసీపీ, నెక్కొండ సీఐ తిరుమల్, ఖానాపురం, నల్లబెల్లి ఎస్సైలు నండృ సాయిబాబు, బండారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో  అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఎస్సై సాయిబాబుకు అభినందనలు
అదృశ్య కేసు నమోదు చేసుకున్న ఎస్సై సాయిబాబు కేసు చేదించడంతో ఉన్నతాధికారులు అభినందించారు. విచారణ జరిపి బావిలో మృతదేహాన్ని పడేశారనే విషయం తెలియగానే సర్పంచ్‌ కాస ప్రవీణ్‌కుమార్‌ సహకారంతో రెండు రోజుల నుంచి బావిలోని నీటిని తొలగించారు. వర్షంలో పూర్తిగా తడుస్తూ మృతదేహాన్ని బయటకు తీయడానికి శ్రమించారు.

రెండు రోజుల తర్వాత ఎట్టకేలకు మృతదేహాన్ని బయటకు తీసి వైద్యుల సమక్షంలో పోస్టుమార్టం చేసే ప్రక్రియను పూర్తి చేయించడంతో ఎస్సై సాయిబాబుతో పాటు సర్పంచ్‌ ప్రవీణ్‌కుమార్, గ్రామ పంచాయతీ సిబ్బందికి ఉన్నతాధికారులతో పాటు స్థానికులు అభినందనలు తెలిపారు. రెండు నెలలుగా కనిపించకుండా పోయిన రవి హత్య మిస్టరీ వీడడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. 

చదవండి: సెల్ఫీలు దిగితే క్రిమినల్‌ కేసు.. నోటిఫికేషన్‌ విడుదల 

మరిన్ని వార్తలు