పాతబస్తీలో దారుణం..

19 Oct, 2020 02:50 IST|Sakshi
రాధిక (ఫైల్‌)

సోదరుడితో కలసి ప్రియురాలిని హత్య చేసిన ఉన్మాది

హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం

మృతురాలు న్యాయశాస్త్ర విద్యార్థిని

యాకుత్‌పురా/నారాయణఖేడ్‌ (హైదరాబాద్‌): ప్రేమ పేరిట ఊసులు చెప్పాడు.. పెళ్లి అనేసరికి ప్రియురాలి ఉసురుతీశాడు. ప్రేమించిన యువతిని ప్రియుడు తన సోదరుడితో కలిసి దారుణంగా హత్య చేశాడు. ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ ఉన్నతంగా ఎదగాల్సిన యువతి కలలను అర్ధాంతరంగా చిదిమేశాడు. జంతుప్రేమికురాలైన ఆ యువతి తాను ప్రేమించింది ఓ క్రూర జంతువునని గ్రహించలేక... అతడి చేతిలో అసువులు బాసింది. ఈ సంఘటన ఆదివారం హైదరాబాద్‌ రెయిన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని నాగల్‌గిద్ద మండలం కరస్‌గుత్తి ప్రాంతానికి చెందిన రాజ్‌ కుమార్‌ కుటుంబం కొన్నేళ్ల క్రితం బతుకు తెరువు కోసం నగరానికి వచ్చి ఆసిఫ్‌నగర్‌లోని దత్తాత్రేయనగర్‌లో నివాసముంటోంది.

రాజ్‌ కుమార్‌ కూతురు రాధిక (24) మహాత్మాగాంధీ లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీ చదువుతోంది. జంతు ప్రేమికురాలైన రాధిక గచ్చిబౌలిలోని పీపుల్స్‌ ఫర్‌ యానిమల్స్‌ సంస్థలో జంతువులకు శిక్షణ ఇస్తోంది. జంతువులకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇందులో భాగంగా కొన్నినెలల క్రితం రెయిన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మదీనానగర్‌ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ మహ్మద్‌ ముస్తఫాతో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.  

సోదరుడితో కలిసి గొంతుకోసి: ఇరవై రోజుల నుంచి రాధిక ఫోన్‌ చేస్తున్నా అందుబాటులోకి రాకుండా ముస్తఫా తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో రాధిక శనివారంరాత్రి మదీనానగర్‌లోని ముస్తఫా ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. రాధిక, ముస్తాఫా కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రాధికను నమ్మించి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అర్ధరాత్రి తన సోదరుడు సయ్యద్‌ జమీల్‌ వసే(24)తో కలసి కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. మీర్‌చౌక్‌ ఏసీపీ ఆనంద్, రెయిన్‌బజార్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు, క్లూస్‌ టీమ్‌లు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలు దళితురాలు కావడంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తమ గ్రామానికి చెందిన అమ్మాయి హైదరాబాద్‌లో ఉంటూ ఉన్నత విద్యాభ్యాసం చేస్తూ ఉన్నతంగా ఎదుగుతుందని భావిస్తే ప్రేమోన్మాది చేతిలో బలి అయిందని కరస్‌గుత్తి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు