వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని.. రెండేళ్ల చిన్నారిని గోడకు బాది

20 Dec, 2022 11:51 IST|Sakshi
కేసు వివరాలు వెల్లడిస్తున్న నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి, చిత్రంలో నిందితులు

సాక్షి, నల్గొండ: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ తల్లి పేగుబంధం మరచి రెండేళ్ల పసిపాపను అత్యంత కర్కశంగా చంపేసింది. ప్రియుడితో కలిసి చిన్నారి ఊపిరి తీసేసింది. తలను గోడకు బాది.. ఆపై ముక్కు మూసి నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా హత్య చేసి ‘అమ్మ’తనానికి మాయని మచ్చతెచ్చింది. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడడంతో చివరకు కటకటాలపాలైంది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన రెండేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.

అరెస్ట్‌ చేసిన ఇద్దరు నిందితులను సోమవారం నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో నల్లగొండ డీఎస్పీ నర్సింహారెడ్డి మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. చిట్యాల మండలం ఎల్లికట్టె గ్రామానికి చెందిన ఉయ్యాల వెంకన్నకు కనగల్‌ మండలం లచ్చుగూడెం గ్రామానికి చెందిన రమ్యతో 2015లో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ప్రియాంశిక ఉన్నారు. రెండేళ్ల క్రితం కరోనా మహమ్మారి బారిన పడి వెంకన్న మృతిచెందడంతో రమ్య తన అత్తగారింట్లోనే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది.

ఈక్రమంలో అదే గ్రామంలో కిరాణా దుకాణం నడుపుతున్న పెరిక వెంకన్నతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది అత్తమామలకు తెలియడంతో పలుమార్లు పెద్ద మనుషుల వద్ద పంచాయితీలు కూడా జరిగాయి. దీంతో మకాం నార్కట్‌పల్లికి మార్చారు. పెరిక వెంకన్న, రమ్య భార్యాభర్తలమని నమ్మబలికి రెండేళ్ల ప్రియాంశికతో కలిసి ఆరు నెలలుగా నార్కట్‌పల్లిలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కుమారుడిని మాత్రం తాత, నాయనమ్మల వద్ద ఎలికట్టేలోనే ఉంచింది. 

ఏడుస్తోందని చంపేశారు.. 
చిన్నారి రోదిస్తూ, భయపడుతోందంటూ పెరిక వెంకన్న, రమ్య హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ప్లాన్‌కు అనుగుణంగా తనకు, ఇద్దరు పిల్లలకు ఏమైనా హాని కలిగితే అత్త మామలు, ఎల్లికట్టె గ్రామ ఎంపీటీసీ దశరథ, మాదగోని శ్రీను, గ్రామ పెద్ద మనుషులే కారణం అని ఓ వీడియో తీసి దానిని ఈ నెల 13న ఎలికట్టె విలేజ్‌ గ్రూపులో పెట్టి బంధువులకు రమ్య వైరల్‌ చేసింది. మరుసటి రోజు రాత్రి ఇద్దరూ కలిసి చిన్నారి ప్రియాంశిక తలను గోడకు బాది.. సెల్‌ఫోన్‌తో కొట్టి, ఆ తర్వాత ముక్కు మూసి నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం చిన్నారికి ఫిట్స్‌ వచి్చందని నమ్మబలికి అదే రోజు రాత్రి 11 గంటలకు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

పరీక్షించిన వైద్యులు బాలిక మృతిచెందిందని ధ్రువీకరించడంతో, మృతదేహాన్ని మార్చురీలో వదిలేశారు. సమాచారాన్ని అత్తమామలకు చేరవేసి ప్రియుడితో కలిసి రమ్య పరారైంది. బాలిక తాత యాదయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా రమ్య, పెరిక వెంకన్నను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారని డీఎస్పీ వివరించారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐ శివరాంరెడ్డి, ఎస్‌ఐ బొడిగే రామకృష్ణ, ఏఎస్‌ఐ నర్సిరెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్స్‌ సురేందర్, రమేశ్‌లను డీఎస్పీ అభినందించారు. 

మరిన్ని వార్తలు