ఇద్దరితో వివాహేతర సంబంధం.. ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌..

15 Jun, 2022 13:19 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

రామభద్రపురం: మండలంలోని ముచ్చర్లవలసలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వివాహిత దాలి రమణమ్మ కేసులో వివాహేతర సంబంధం కారణంగా ఆమె హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 10 వ తేదీన అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆమె తల వెనుక భాగంలో బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో కింద పడి ఉంది. దీంతో కుటుంబసభ్యులు బాడంగి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ    మృతిచెందింది.

హతురాలి తల్లి బంటు చిన్నమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శోభన్‌బాబు ఆధ్వర్యంలో ఎస్సై కృష్ణమూర్తి బృందం దర్యాప్తు చేసి అన్నికోణాల్లో విచారణ చేసింది. ఈ విచారణలో వివాహేతర సంబంధమే రమణమ్మ హత్యకు కారణమని తేల్చారు. ఈ మేరకు  మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ శోభన్‌బాబు మాట్లాడుతూ దాలి రమణమ్మ(35)కు అదే గ్రామానికి చెందిన నడగాన రమణతో కొన్నేళ్ల నుంచి వివాహేతర సంబంధంఉంది. అలాగే అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. మొదటి ప్రియుడు రమణ సారా వ్యాపారి.

నిందితుడి అరెస్టు చూపించి వివరాలు వెల్లడిస్తున్న సీఐ శోభన్‌బాబు

చదవండి: (తనకెవ్వరూ సాటిరారని నిరూపించాడు.. దానిని తట్టుకోలేకే చంపేశారా?)

ఈ నెల 10వ తేదీన రాత్రి  ప్రియురాలు రమణమ్మకు రాత్రి 9 గంటల తర్వాత ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ వచ్చింది. దీంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆమె ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. ఆ సమయంలో టీవీ ఆన్‌చేసి పెద్ద సౌండ్‌లో ఉంది. ఇంటి పక్కన నుంచి ఎవరో వ్యక్తి పారిపోయినట్లు అనుమానం వచ్చి ఎవరు వెళ్లిపోతున్నారు? ఎందుకు మరో వ్యక్తిని ఇంట్లోకి రానిచ్చావంటూ రమ్మణమ్మతో  గొడవ పడి గట్టిగా కొట్టి కాలితో బలంగా తన్నాడు. దీంతో ఆమె తల తలుపు, ద్వారం మధ్యలో ఉన్న కోనును తగిలి కింద పడిపోయింది. 11వ తేదీన బంధువులు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందింది. రమణమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు.  

వీఆర్‌ఓ ఎదుట లొంగిపోయిన నిందితుడు 
డాగ్‌స్వాడ్, క్లూస్‌టీంతో పరిశీలించగా డాగ్‌ సరిగ్గా నిందితుడు రమణ ఇంటి దగ్గరకు వెళ్లి ఆగింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తుండగా ఆ గ్రామ వీఆర్వో ఆనందరావు వద్ద మంగళవారం లొంగిపోయాడు. దీంతో నిందితుడిని పోలీసులకు వీఆర్వో అప్పగించగా అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈ సందర్భంగా  రమణమ్మను తానే హత్యచేసినట్లు నిందితుడు రమణ అంగీకరించాడు. అనంతరం నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు సాలూరు తరలించారు. మూడు రోజుల్లో కేసును ఛేదించిన సీఐ, ఎస్సై, పోలీసులను  ఆ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు.

మరిన్ని వార్తలు