వివాహేతర సంబంధం.. అత్త అడ్డుగా ఉండటంతో ప్రియుడితో కలిసి..

1 Jun, 2022 15:48 IST|Sakshi

సామర్లకోట (కాకినాడ): వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉందనే ఆగ్రహంతో ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు హత మార్చిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు మంగళవారం ఈ విషయం తెలిపారు. వారి కథనం ప్రకారం.. మండలంలోని జి.మేడపాడుకు చెందిన బత్తిన మాణిక్యం మార్చి 19 నుంచి కనిపించడం లేదు. దీనిపై ఆమె భర్త బత్తిన కృష్ణ మార్చి 26న పోలీసులకు ఫిర్యా దు చేశాడు. ఈ మేరకు ఎస్సై టి.సునీత అదృశ్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

కృష్ణ, మాణిక్యం దంపతుల కుమారుడు గతంలో మరణించాడు. అతడి భార్య.. అత్తవారింట్లోనే ఉంటోంది. ఆమెకు అదే గ్రామానికి చెందిన వందే వెంకన్న అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉంటోందన్న అక్కసుతో మాణిక్యాన్ని ఆమె కోడలు, వెంకన్నలు హతమార్చారని పోలీసులు నిర్ధారించారు.

ఆమె మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి గోదావరి కాలువలో పడేశారు. ఇందుకు బంది పోలయ్య అనే వ్యక్తి సహాయం తీసుకున్నారని గుర్తించారు. వీఆర్‌ఓ యేడిద భరత్‌ సమక్షంలో నిందితులు ఈ విషయాన్ని అంగీకరించారని ఎస్సై తెలిపారు. ఈ నేపథ్యంలో మాణిక్యం అదృశ్యం కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. నిందితులు ముగ్గురినీ మంగళవారం కోర్టులో హాజరుపరచి, 14 రోజుల రిమాండుకు తరలించారు. మాణిక్యం మృతదేహం ఎక్కడుందో గుర్తించి, స్వాధీనం చేసుకుని, డీఎన్‌ఎ టెస్టుకు పంపాలని ఎస్సై చెప్పారు.

చదవండి: ('ప్రభుత్వానికి ప్రజల్లో చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నించడం దారుణం')

మరిన్ని వార్తలు